"ప్రేక్షకులు మా సినిమాని చూస్తూ ఎగిరెగిరి నవ్వుతారని ముందే చెప్పా. నేనే చూసిన ప్రతిసారీ నవ్వుకుంటున్నా" అన్నారు శ్రీవిష్ణు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. నివేదా థామస్, నివేతా పేతురాజ్, ప్రియదర్శి, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. వివేక్ ఆత్రేయ దర్శకుడు.
విజయ్‌కుమార్ మన్యం నిర్మాత. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్‌మీట్‌ని నిర్వహించింది. దర్శకులు శివ నిర్వాణ, తరుణ్‌భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ ‘‘సమష్టి కృషితో సాధించిన విజయమిది’’ అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ‘‘వెంకటేష్, నాని, అనిల్ రావిపూడి, తరుణ్‌భాస్కర్, రామ్, సురేష్‌బాబు, కేటీఆర్ లాంటి ప్రముఖులు మాకు ప్రోత్సాహం అందించారు. మంచి సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాల’’న్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల ఆదరణ వల్లే మేం ఇలాంటి కొత్త రకమైన సినిమాలు చేయగలుగుతున్నాం. నా పాత్రని చూసి నవ్వుతుంటే ఆనందంగా ఉంది. దర్శకుడు వివేక్ ప్రతిభావంతుడు’’ అన్నారు.
సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘శ్రీవిష్ణు మంచి కథల్ని ఎంచుకొంటాడని మరోసారి రుజువైంద’’న్నారు. ‘‘మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని మా చిత్రం మరోసారి రుజువు చేసింది. ఈ బృందంలో ఏ ఒక్కరు లేకపోయినా ఇంత పెద్ద విజయం సాధ్యమయ్యేది కాద’’న్నారు నివేదా థామస్. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది.