సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నతనంలో బాలనటుడిగా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా మారిన మహేష్ బాబు తొలి సినిమాతో అతి పెద్ద సక్సెస్ ని దక్కించుకున్నారు. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలతో కొనసాగిన మహేష్ బాబు కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలని అందుకున్నారు. అయితే వాటితో పాటు కొన్ని ఫ్లాప్స్ కూడా చవిచూసిన మహేష్ తన కెరీర్ మొత్తంలో అతిథి సినిమా తర్వాత మూడేళ్లపాటు విరామం తీసుకున్న విషయం తెలిసిందే.

అంతకుముందు పోకిరి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న మహేష్ బాబు అనంతరం గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన సైనికుడు సినిమా ప్రేక్షకులను అభిమానులను నిరాశపరచడంతో ఆపై సురేందర్రెడ్డి దర్శకత్వంలో కృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అతిథి సినిమా చేశారు. అయితే రిలీజ్ తర్వాత ఆ సినిమా కూడా ఆశించిన సక్సెస్ ని అందుకోలేకపోయింది.  ఆ తర్వాత తన తదుపరి సినిమా విషయమై ఆరు నెలల సమయం తీసుకుందామని భావించిన మహేష్ అదే సమయంలో హఠాత్తుగా తన అమ్మమ్మ దుర్గమ్మ మరణంతో కొంత కృంగిపోయారు. ఇక ఆ తర్వాత తన భార్య నమ్రతా శిరోద్కర్ తల్లిదండ్రుల యొక్క మరణం మహేష్ కుటుంబాన్ని మరింత కృంగదీసింది అనే చెప్పాలి. దానితో ఆరు నెలలు కాస్త మూడు సంవత్సరాలు సాగడం, ఆ మధ్యలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ఖలేజా సినిమా చేయడం జరిగింది.

సింగనమల రమేష్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. అయితే ఈ మూడు సంవత్సరాలు తనకు కుటుంబం పరంగా ఎన్నో సమస్యలు రావడం అలానే అంతకు ముందు వరుసగా పరాజయాలు వెంటాడటంతో ఎంతో మనో వేదనకు గురయ్యానని, అయితే ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఖలేజా సినిమా చేసినప్పటికీ అది కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలవడంతో తాను మరింత సమస్యలు ఎదుర్కొన్నారని పలు సందర్భాల్లో మహేష్ బాబు చెప్పడం జరిగింది. కాగా ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మహేష్ నటించిన దూకుడు సినిమా అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ అందుకొని కెరీర్ పరంగా ఆయనకి భారీ బ్రేక్ ను అందించింది.....!!






మరింత సమాచారం తెలుసుకోండి: