నాగ్ తనయుడు నాగచైతన్య దశాబ్దం క్రితమే తెరంగేట్రం చేసి.. ఏం మాయ చేశావే, 100% లవ్, మజిలీ, ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్‌స్టోరీ వంటి చిత్రాల విజయాలతో పర్వాలేదనిపించినా తండ్రి స్థాయి మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకోలేకపోయాడు. నాగ్ రెండో తనయుడు అఖిల్‌పై ఆ కుటుంబ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. తెరంగేట్రం చేయడానికి ముందే టాలీవుడ్‌ను దాటి బాలీవుడ్ వరకు అఖిల్ పేరు మారుమోగింది. అయితే మొదటి సినిమా అఖిల్ ఈ అంచనాలను తారుమారు చేసింది. డైరెక్టర్ ఈ హీరోను సరిగా లాంచ్ చేయలేకపోయాడు. ఇందుకు నాగార్జున కూడా బాధపడే ఉండాలి. అయితే ఆ తరువాత అఖిల్ తన ప్రయత్న లోపం లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం మాత్రం తనకు దూరంగానే ఉంటోంది. విక్రం కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హలో’ అపజయాన్నే ఇవ్వగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన మిస్టర్ మజ్ను డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మాత్రం కాస్త మెరుగైన టాక్ తెచ్చుకుంది. అయితే స్టార్ హీరోగా ఎదిగేందుకు అన్నిరకాల అర్హతలున్న అఖిల్ స్థాయికి ఇంకా పెద్ద సక్సెస్‌లే వచ్చి ఉండాల్సిందని, వెనకాల పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉన్నా, స్టార్ కిడ్ అయినా ఈ పరిస్థితి ఏంటని అక్కినేని అభిమానులు వాపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి