
ఇరు వర్గాలతో విడిగా చర్చలు జరిపిన ఆయన తరువాత ఒకే టేబుల్ మీద కూర్చోబెట్టారు. కార్మికుల సమస్యలు నిర్మాతలకు వివరించగా, నిర్మాతల ఆర్థిక బాద్యతలు కార్మికులకు వివరించారు. చిరు మధ్యవర్తిత్వం అటు ఇటు రెండువైపులా గౌరవం పొందింది. చివరికి, కార్మికులు అడిగిన 30 శాతం వేతనాల పెంపు కాకపోయినా, నిర్మాతలు 22.5 శాతం పెంపుకి అంగీకరించారు. ఈ పెంపు ఒక్కసారిగా కాకుండా మూడు దఫాలుగా అమలు చేయబడుతుంది. మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది మరో 5 శాతం పెంచడానికి అంగీకారం కుదిరింది. దీంతో రెండు వర్గాలూ సంతృప్తి వ్యక్తం చేసి, షూటింగులు యధావిధిగా ప్రారంభం కావడానికి మార్గం సుగమం అయింది.
అయితే సమ్మె సమయంలో చర్చకు వచ్చిన పని గంటలు, ఆదివారాలు డబుల్ బేటా వంటి అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. వీటిని పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి, నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పరిణామాలతో కార్మికుల ముఖాల్లో నవ్వులు తిరిగి వచ్చాయి. నిర్మాతలు కూడా పెద్ద ఇబ్బందులు లేకుండా రాజీ దిశగా అడుగులు వేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సమస్య పరిష్కారంలో మెగాస్టార్ ప్రయత్నాలు పరిశ్రమ మొత్తం మెచ్చుకుంటోంది. "చిరు రంగంలోకి దిగకపోతే ఈ సమ్మె ఇంత సులభంగా తేలేది కాదు" అని పలువురు అంటున్నారు. ఇకపై తాత్కాలిక ఆటంకాల్లేకుండా తెలుగు సినిమా రంగం మళ్లీ రైలు పట్టాలపై దూసుకుపోనుంది.