కన్నడ సినీ ఇండస్ట్రీలో ఇటీవ‌ల కాలంలో పెద్ద సంచ‌ల‌నంగా నిలిచింది దర్శన్ – రేణుకాస్వామి హత్యకేసు. తనకున్న మాస్ ఇమేజ్, స్టార్‌డమ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దర్శన్, గత ఏడాది ఈ కేసులో నిందితుడిగా మార‌డం కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఎఫ్ఐఆర్‌లోనే పోలీసులు స్పష్టంగా "దర్శన్ స్వయంగా రేణుకాస్వామిపై దాడి చేశాడు" అని పేర్కొనడం, ఆ తర్వాత ఆధారాలు బయటపడడంతో అతను జైలుకి వెళ్లాల్సి వచ్చింది.


కానీ ఎక్కువ కాలం గడవకముందే, కేవలం ఆరు నెల‌ల‌లోనే దర్శన్ రెగ్యులర్ బెయిల్ మీద బయటికి రావడం సంచలనం రేపింది. ఇంత బలమైన సాక్ష్యాలు ఉండి కూడా బెయిల్ రావడం ఎలా? అనే ప్రశ్నలు అభిమానులే కాకుండా సినీ వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది. తాజాగా ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని, దర్శన్‌కు మంజూరైన బెయిల్ రద్దు చేయాలని ఆదేశించింది. దీంతో అతను తిరిగి జైలుకు వెళ్లక తప్పలేదు. ఈ పరిణామం దర్శన్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.



దర్శన్ బెయిల్ మీద బయటకు రాగానే పెండింగ్‌లో ఉన్న తన ప్రాజెక్ట్ “డెవిల్” షూటింగ్ పూర్తి చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎక్కువ భాగం ముగిసిపోయాయి. హీరో ప్రమోషన్లలో పాల్గొనే అవకాశం ఉండగానే, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన మళ్లీ జైలుకు వెళ్లిపోయాడు. అయినా సినిమా టీం వెనకడుగు వేయలేదు. డిసెంబర్ 12న డెవిల్ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా దర్శన్ భార్య స్వయంగా ఆయన సోషల్ మీడియా హ్యాండిల్‌ను టేక్ ఓవర్ చేసి, “ఇకపై దర్శన్ సినిమాల అప్‌డేట్స్ నేను ఇస్తాను” అంటూ స్పష్టంగా చెప్పడం మరింత చర్చనీయాంశమైంది.



దర్శన్ లేకుండా డెవిల్ ప్రమోషన్లు ఎలా సాగుతాయి? హీరో జైల్లో ఉండగా ఆయన సినిమా చూడటానికి ప్రేక్షకులు ముందుకొస్తారా? అనే సందేహాలు ఉన్నాయి. కానీ మరోవైపు, దర్శన్ మాస్ ఫాలోయింగ్‌ను బట్టి చూసుకుంటే, ఆయన లేని లోటు తక్కువగానే అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ హిట్ మూవీ "మిలన్" దర్శకుడు ప్రకాశ్ తెరకెక్కించడం పాజిటివ్ సైడ్‌గా నిలుస్తోంది. దర్శన్ ఇమేజ్, సోషియో డ్రామా టచ్ కలిసితే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ జరగొచ్చు. ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే … జైల్లో హీరో… బయటకి సినిమా! – ఈ డ్రామాకి ఫలితం ఏంటి అనేది కర్ణాటక సినీ ఇండస్ట్రీ మొత్తం గమనిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: