
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'కూలీ' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా, ప్రేక్షకుల అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేదు. దీనిపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కూలీ' సినిమా గురించి ప్రజలు పెట్టుకున్న అంచనాలపై లోకేష్ మాట్లాడుతూ, రజనీకాంత్ సినిమాపై అభిమానులు అనవసరమైన ఊహాగానాలు చేసుకున్నారని చెప్పారు.
ఈ సినిమా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమని కానీ, లేదా ఇది టైమ్ ట్రావెల్ మూవీ అని కానీ తాను ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రేక్షకులు తమ సొంత ఊహలతో ఈ అంశాలను సినిమాలో ఆశించారని, అవి లేకపోవడంతో నిరాశ చెందారని లోకేష్ అభిప్రాయపడ్డారు. తాను ఎప్పుడూ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే కథలను రాస్తానని, వారిని మెప్పించడమే తన లక్ష్యమని ఆయన వివరించారు. ఈ సినిమాపై వచ్చిన అంచనాలను తాను తప్పుబట్టడం లేదని, కానీ కొన్ని ఊహలు అవాస్తవమని లోకేష్ అన్నారు.
'కూలీ' చిత్రం విజయం సాధించినప్పటికీ, అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలు పూర్తిగా నెరవేరలేదనేది లోకేష్ మాటల సారాంశం. ఇది సినిమా ఫలితంపై భిన్నాభిప్రాయాలకు దారితీసింది. మరోవైపు లోకేష్ కనగరాజ్ భవిష్యత్తు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. భవిష్యత్తు సినిమాలు ఆ అంచనాలను అందుకుంటాయో లేదో చూడాల్సి ఉంది.
లోకేష్ కనగరాజ్ సినిమాలకు ఏ సర్టిఫికెట్ రావడం కూడా ఒక విధంగా మైనస్ అవుతోందని చెప్పవచ్చు. కూలీ సినిమాకు ఏ సర్టిఫికెట్ వల్ల కలిగిన నష్టం అంతాఇంతా కాదు. అయితే మోనికా సాంగ్ ఈ సినిమాకు ప్లస్ అయింది. కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. కూలీ సినిమా ఇతర భాషల్లో సైతం హిట్ గా నిలవడం గమనార్హం. రజనీకాంత్ వయస్సు పెరుగుతున్నా భారీ విజయాలను అందుకుంటున్నారు.