ఒక సినిమా బ్రాండ్ వాల్యూ ఎంత బలంగా ఉందో అంచనా వేయాలంటే, దాని రీ రిలీజ్ సమయంలో ప్రేక్షకులు చూపించే స్పందన చాలు. ఈ రూల్‌ మరోసారి నిరూపిస్తున్నది ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ ఎపిక్ సినిమా ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్’ అనే పేరుతో సరికొత్త రూపంలో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా రెండు వారాల సమయం ఉండగానే, ఓవర్సీస్‌లో ముఖ్యంగా యూఎస్‌ఏలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఇది పదేళ్ల తర్వాత కూడా ‘బాహుబలి’ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టంగా తెలియజేస్తోంది. యూఎస్‌ఏలో ప్రభాస్‌కు ఉన్న అభిమాన గ‌ణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


అక్క‌డ ఇప్పుడు ప్ర‌భాస్‌ పాత సినిమాలు రీ రిలీజ్ చేసినా కూడా మంచి వసూళ్లు సాధిస్తాయి. అయితే ఈసారి ‘బాహుబలి: ది ఎపిక్’ మాత్రం ఆ లెక్కలన్నింటినీ తిరగరాసింది. ప్రీ సేల్స్ దశలోనే ఈ సినిమా 61,000 డాలర్ల (సుమారు రూ.50 లక్షలు) మార్క్‌ను దాటేసింది. ఈ సంఖ్య ప్రభాస్ గత రీ రిలీజ్ చిత్రాలైన ‘బిల్లా’ ($13,581) మరియు ‘సలార్’ ($7,904) ఫుల్ రన్ కలెక్షన్లను మించి ఉంది. అంటే, కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ రీ రిలీజ్ ఒక సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ప్రాజెక్ట్ కేవలం పాత సినిమాను తిరిగి విడుదల చేయడం మాత్ర‌మే కాదు... రెండు భాగాలను కలిపి, కొన్ని కొత్త సన్నివేశాలు జోడించి, 3 గంటల 44 నిమిషాల నిడివితో ఒక సరికొత్త సినిమాటిక్ అనుభవంగా రూపొందించారు.


అలాగే విజువల్స్, సౌండ్ డిజైన్, కలర్ గ్రేడింగ్ అన్నీ క‌లిసి థియేటర్‌లో మళ్లీ చూడాలనిపించేలా ఉంది. ఇండియాలోనూ ఈ సినిమా రీ రిలీజ్ పై మామూలు హైప్ లేదు. బుక్ మై షో వంటి ప్లాట్‌ఫామ్‌లలో టికెట్ ఇంటరెస్ట్ కొత్త సినిమాల స్థాయిలో కనిపిస్తోంది. దీని వల్ల రీ రిలీజ్ అయినా కూడా ‘బాహుబలి’కి మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది. అసలు సవాల్ మాత్రం ఇక్కడే ఉంది. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్న సినిమాను ఇప్పటికే అనేక సార్లు చూసిన ప్రేక్షకులు మళ్లీ పూర్తిగా థియేటర్లలో ఆస్వాదిస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: