నకిలీ మద్యం కేసులో టిడిపి అదే విధంగా వైసిపి రెండు పార్టీలు కూడా ఇరుక్కున్నాయి అన్నది వాస్తవం. ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ విషయాలు పక్కన పెడితే ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్లినప్పటికీ టిడిపి తరఫున గత ఎన్నికల్లో టికెట్టు పొందిన జయచంద్ర రెడ్డి ఈ కేసులో ఇప్పటికే పేరు వినిపిస్తోంది. ఆయనను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. అంటే పరోక్షంగా టిడిపి నాయకుల ప్రమేయం ఉందన్నది ఒప్పుకున్నట్లయింది.


దీంతో నకిలీ మద్యం వ్యవహారంలో టిడిపి మూలాలపై ఎక్సైజ్ అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పుడు ఈ కేసును డీల్ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా అదే కోణంలో తంబళ్లపల్లి నుంచి విచారణ చేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ఇదే కేసులో జోగి రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అసలు నకిలీ మద్యం తయారీ ఎలా చేశారు. దీనికి సంబంధించిన మూలాలు ఎక్కడ ఉన్నాయనే విషయాలను పోలీసులు ఆరాతీస్తున్నారు.


గతంలో జోగి రమేష్ కుటుంబంతో ఈ కేసు సూత్ర‌ధారి అద్దేపల్లి జనార్దన్ రావు కుటుంబానికి అనుబంధం ఉందని అక్కడి నుంచే ఆయన నకిలీ మద్యం మూలాలు ప్రారంభం అయ్యాయని కూడా అధికారులు చెబుతున్నారు. దీంతో అటు జయచంద్రారెడ్డి ఇటు జోగి రమేష్ వ్యవహారం ఇరు పార్టీలోనూ పెద్ద తలనొప్పిగా మారింది. నిన్నటి వరకు ఇది మీకేసంటే మీ కేసని వాదించుకున్నప్పటికీ ఇప్పుడు ఇరు పార్టీల నాయకుల ప్రమేయం ఉందన్నది అధికారులు స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో అంతర్గత చర్చల్లో ఈ వ్యవహారం ఇరుపార్టీలకు ఇబ్బందికరంగానే మారింది.


ఒకవైపు నకిలీ మద్యం వ్యవహారంలో భారీ ఎత్తున ఉద్యమాలు చేసిన వైసీపీలోనూ ఈ చర్చ నడుస్తుంది. మరోవైపు అసలు ఇదంతా వైసిపి హయాం నుంచే జరిగిందని చెబుతున్న టిడిపిలోనూ ఈ విషయం నలుగుతోంది. మొత్తంగా చూస్తే అటు జ‌య‌ చంద్రారెడ్డి- జోగిల  చుట్టూ ఈ నకిలీ మద్యం కేసు తిరుగుతోందన్నది వాస్తవం. చివరకు ఇది పార్టీలకు ఏ మేరకు మైనస్ గా మారుతుంది.. ఏ విధంగా ఇది మలుపు తిరుగుతుంది. అనేది మరింత ఆసక్తిగా మారిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: