రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మూవీస్ లో ఒకటిగా ఉన్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో మొదటి సాంగ్ ని ని కొద్ది సేపటి క్రితం విడుదల చేసారు. ‘ఘన కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మణిదీపకా ఓ కథానాయకా’.. అంటూ సాగిన ఈ పాట వినడంతోనే గగుర్పాటు కలిగించేలా తెలుగు వారి
ఖ్యాతిని ఇనుమడింపచేసేలా ఉండడం విశేషం. ఈ పాట అన్న గారి సినిమా రేంజికి పెంచేసేలా ఉందని అంటున్నారు. పాటకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీపై ఇంకా అంచనాలు పెరుగుతున్నాయి.
మ్యూజిక్ లెజెండ్ ఎమ్ ఎమ్ కీరవాణి అద్భుతమైన స్వరాలను సమకూర్చగా.. ఆయన తండ్రి శివ శక్తి దత్తా ముత్యాల్లాంటి తెలుగు అమరికలతో సాహిత్యం అందించారు. ఈ పాటలోని ప్రతి పదం అన్నగారి ఔన్నత్యాన్ని చాటి చెప్పేదిగా ఉంది. విలక్షణ గొంతుతో సింగర్ కైలాష్ ఖేర్ ఈ పాటకు ప్రాణం పోశారు. కాగా ఈ చిత్ర తొలి భాగం ‘కథానాయకుడు’ పేరుతో జనవరి 9న విడుదల కానుండగా, రెండో భాగం ‘మహానాయకుడు’ పేరుతో జనవరి 24న విడుదల కానుంది.
‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రంపై రోజు రోజుకూ అంచనాలు పెంచేస్తుంది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ సినీ అభిమానుల దృష్టిని బయోపిక్ వైపుకి తిప్పిన క్రిష్ అంధనాలను పెంచడంలో మాత్రం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈ సాంగ్ విన్న తరువాత ఎవరికి వారు విజువలైజేషన్ చెసుకుంటారు. దాంతో ఈ మూవీపై మరింతగా ఇంటెరెస్ట్ పెరుగుతోంది. ఈ మూవీకి క్రిష్ డైరెక్టర్ కావడం ఎంతగా ప్లస్ అయిందన్నది ఆయన ప్రచార శైలి, పాత్రల ఎంపిక, సినిమాపై కనబరుస్తున్న పూర్తి శ్రద్ధను బట్టి చెప్పేయవచ్చు. మరో 47 రోజుల్లో సినిమా ధియేటర్లలో అన్న గారి బొమ్మ వచ్చేస్తోందన్నఉత్కంఠ ఇపుడు అందరిలోనూ కనిపిస్తోంది.