ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. చాలామంది సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పేరుతో సోషల్ మీడియాలో ఒక లేఖ తెగ వైరల్ అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యే ఎటువంటి లేఖను విడుదల చేయకపోయినా ఆ లేఖ వైరల్ కావడం గమనార్హం. తాజాగా విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రాసినట్టు ఒక లేఖ వైరల్ అవుతోంది.
 
ఆ లేఖలో ఆయన రాజధాని అమరావతి గురించి, మూడు రాజధానుల అంశం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వాసుపల్లి గణేష్ ఏపీ అభివృద్ధి అమరావతితో మాత్రమే సాధ్యం అవుతుందని... తాను మూడు రాజధానులకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై కూడా లేఖలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ లేఖ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్పందించారు.
 
సోషల్ మీడియాలో తన పేరు మీద ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక లేఖ వైరల్ అవుతోందని అయితే ఆ లేఖను తాను రాయలేదని చెప్పుకొచ్చారు. అసలు ఈ లేఖ ఎలా వచ్చిందో తనకు తెలియదని అన్నారు. లేఖ తాను రాయలేదని ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ వర్గాల్లో లేఖ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలేఖ రాయకపోతే ఈ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందెవరు...? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
 
ఎమ్మెల్యే రాయని లేఖ రాసినట్టు ప్రచారం జరుగుతుండటంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరుగుతోందా...? అనే ప్రచారం ఏపీలో జరుగుతోంది. ఎమ్మెల్యే కూడా ఈ లేఖ గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే ఈ విషయమై పోలీసులను ఆశ్రయించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ రాజధాని విషయంలో గందరగోళనం నెలకొన్న తరుణంలో ఇలాంటి లేఖలు ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: