రెండోద‌శ‌లో ఉన్న ప‌రిస్థితుల‌ను అంచ‌నావేస్తే అక్టోబ‌రులో మూడోద‌శ రావ‌డానికి అవ‌కాశాలున్నాయ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించ‌డంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ ద‌శ‌లో ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ప్రభావానికి లోనయ్యే ప్రమాదముంద‌ని చెబుతుండ‌టంతో ఎదుర్కొనేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. వైరస్‌లో మార్పులు, రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటున్న మ్యుటేషన్లపై సమర్థంగా పనిచేసేలా వ్యాక్సిన్ల ఫార్ములాలో అప్‌డేట్లు తీసుకురావడం అవసరమంటున్నారు. రాష్ర్టాలు, ఉన్నత విభాగాలు, వైద్యులు సమన్వయంతో మహమ్మారిని జయించాలని కేంద్ర ఆరోగ్య‌శాఖ సూచిస్తోంది. ఇప్ప‌టికే దేశంలోని చాలా రాష్ట్రాలు త‌మ త‌మ వ్యూహాల‌ను సిద్ధం చేసుకోవ‌డంతోపాటు చిన్నారుల ర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక ర‌క్ష‌ణ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నాయి.

అన్ని రాష్ట్రాల్లో ఇలా!!
మూడోద‌శ‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు  రాష్ట్రాలు అస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. ముంబ‌యిలో చిన్నారుల కోసం కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ చిల్డ్రన్‌ ప్రొటెక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. పిల్లల్లో ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ముఖ్య‌మంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మహమ్మారి ముప్పు నుంచి పిల్లలను రక్షించి, యుద్ధప్రాతిపదికన సేవలు అందించేందుకు ఢిల్లీ సర్కార్‌ ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పీడియాట్రిక్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్లను కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల కోసం పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది. 15 మంది సభ్యులతో ప్రత్యేక కార్యదళాన్ని గోవా ప్రభుత్వం సిద్ధం చేసింది. యూపీ, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఏపీలో మాత్రం ఇంత‌వ‌ర‌కు ఏం చేయాల‌నేదానిపై స‌మీక్షే జ‌ర‌గ‌లేదు. భావిభార‌త పౌరుల ర‌క్ష‌ణ‌కు సంబంధించి అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రాన్ని కేంద్రం ఇప్ప‌ట‌కే అన్ని రాష్ట్రాల‌కు నొక్కి చెపుతోంది. మూడోద‌శ‌పై వ‌స్తున్న హెచ్చ‌రిక‌ల‌ను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ప్ర‌జ‌లంతా కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: