తీర్పు ఎలా ఉంటుందో తెలియదు...! దశాబ్దాల వివాదానికి దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి పరిష్కారం చూపించబోతుందో అనే ఆసక్తి..! అయోధ్య తీర్పుకు సమయం దగ్గరపడుతున్న వేళ ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే భారీగా బలగాలు యూపీకి తరలించారు. అటు ఈ అంశంపై ఎవ్వరూ మాట్లాడొద్దని నేతలకు ప్రధాని సూచించారు. 


అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు కొద్దిరోజుల్లో తీర్పు వెలువరించనుంది. దీంతో  ఈ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులకు, పార్టీ నేతలకు హితవు పలికారు. ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరికీ శాంతి, సామరస్యాలను కాపాడవలసిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు మోడీ. ఈ కేసులో కోర్టు తీర్పును తీర్పుగానే చూడాలని, గెలుపోటముల ప్రస్తావన తీసుకు రావొద్దని ప్రధాని మోడీ దేశ ప్రజలకు సూచించారు.


సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.  ఉత్తరప్రదేశ్‌కు అదనపు బలగాలను తరలించారు. అయోధ్య తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. సోషల్ మీడియాపైనా ఓ కన్నేసి ఉంచారు. సోషల్ మీడియాపై నిఘా పెట్టేందుకు ఫజియాబాద్ పోలీసులు 16వేల మంది వాలంటీర్లను నియమించారు. అటు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌  అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని జోన్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది. తీర్పుకు సమయం దగ్గరపడుతున్న వేళ.. సిబ్బంది సెలవులు రద్దు చేసి వారిని రైళ్లలో ఎస్కార్టులుగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఫ్లాట్‌ఫార్మ్ లు, రైల్వేస్టేషన్ లు, యార్డులు, పార్కింగ్‌ స్థలాలు, బ్రిడ్జిలు, టన్నెల్స్‌, వర్క్‌షాపులు ఇలా అవాంఛనీయ సంఘటనలు, పేలుడు పదార్థాలు అమర్చే అవకాశమున్న ప్రతి చోటా భద్రతను కట్టుదిట్టం చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది.


యూపీలో 8 తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేశారు. అయోధ్య పై ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయొద్దని ఇప్పటికే అన్ని పార్టీలు నేతలకు విజ్ఞప్తి చేశాయి. తీర్పు విషయంలో శాంతియుతంగా స్పందించాలని హిందూ, ముస్లిం సంస్థలు విజ్ఞప్తి చేశాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: