``యత్ర నార్యేస్తూ పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా.. అని మాట్లాడుకోవడానికి, రాసుకోవడానికి తప్ప ఆచరణలోకి తీసుకురావడం లేదు.`` అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వెట‌ర్నరీ డాక్ట‌ర్ ప్రియాంక రెడ్డి హ‌త్య‌పై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మేర‌కు పై వ్యాఖ్య‌లు చేశారు. శంషాబాద్‌లో డాక్టర్ ప్రియాంక రెడ్డిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన త‌న‌ను తీవ్రంగా కలచి వేసిందని ఆయ‌న పేర్కొన్నారు. మూగ జీవాలకు చికిత్స చేసే ప్రియాంక కొందరు మానవ మృగాల బారినపడి అన్యాయమై పోయిందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘోరాన్ని మనసున్న ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయ‌న కోరారు. డా.ప్రియాంక రెడ్డి కుటుంబానికి త‌న తరఫున, జనసైనికుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని ప‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

 

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ విష‌యంలో వ‌రుస‌గా ఘ‌ట‌న‌లు జ‌రుగ‌డం బాధాక‌ర‌మ‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ``శంషాబాద్ ఘటన అనే కాదు... కొద్దిరోజుల కిందట చిత్తూరు జిల్లాలో ఆడుకొంటున్న చిన్నారిని ఒక దుర్మార్గుడు చిదిమి వేశాడు. మొన్నటికి మొన్న వరంగల్‌లో  ఓ ఇంటర్మీడియట్ విద్యార్థినిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడి చంపేశాడు. నిర్భయ చట్టం తెచ్చినా బాలికలు, యువతులపై అత్యాచారాలు చేసేవాళ్లకు, వేధింపులకు పాల్పడేవారికీ ఎలాంటి బెదురూ రావడం లేదు.`` అని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా కఠిన రీతిలో శిక్షించాలని ప‌వ‌న్ డిమాండ్ చేశారు. సింగపూర్ లాంటి దేశాల్లో ఇలాంటి శిక్షలు ఉన్నాయని ఆయ‌న పేర్కొన్నారు. పోలీస్ శాఖ సైతం షీ టీమ్స్ ను మరింత బలోపేతం చేయాలని ప‌వ‌న్ కోరారు. ``శివారు ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్, పర్యవేక్షణ పెంచాలి. విద్యార్థినుల్లో, యువతుల్లో ఆత్మస్థైర్యం పెంచడంతోపాటు ప్రాణ రక్షణకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. `` అని సూచించారు.

 

ఇదిలాఉండ‌గా, ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి జి.కిష‌న్ రెడ్డి సైతం నిందితుల‌ను ఉరితీయాల‌ని పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. . ప్రభుత్వోద్యోగిగా ఉన్న ప్రియాంకపై బరితెగింపుతో వ్యవహరించి కిరాతకానికి పాల్పడటం హేయమన్నారు. ఈ ఘటనను ప్రజలంతా ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవహారంలో దోషులను ఉరి తీయాలని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో యువతి హత్యపై యావత్‌ దేశం ఆందోళన, బాధను వ్యక్తంచేస్తోందన్నారు. ఈ విషయంపై తెలంగాణ డీజీపీ నుంచి పూర్తి వివరాలు తీసుకుంటానని చెప్పారు.                                                                                                                                           

 

మరింత సమాచారం తెలుసుకోండి: