పుట్టగొడుగులతో కరోనాను జయించవచ్చా? కరోనాకు విరుగుడుగా మష్రూమ్స్‌ పని చేస్తాయా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. కరోనా వైరస్‌ను అంతం చేయడానికి పుట్టగొడుగుల్ని మించిన ఆహారం లేదంటున్నారు హైదరాబాద్‌కి చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు. పుట్టగొడుగులపై తాము చేసిన పరిశోధనలో ఈ విషయం నిర్ధారణ అయిందంటున్నారు.  

పుట్టగొడుగుల్లో పోష‌క పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వాటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని అనేక అధ్యయనాల్లో తేలింది. వీటిలో విట‌మిన్ B, Dతో పాటు శరారీనికి అవసరమైన పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి. మష్రూమ్‌లను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఫలితంగా ఊబకాయం త‌గ్గడంతో పాటు మ‌ధుమేహంతో పాటు ప్రాణాంతకమైన క్యాన్సర్ల నుంచి ఉప‌శ‌మ‌నం లభిస్తుందని పలు అధ్యయనాల ద్వారా గుర్తించారు. ప్రస్తుతం యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి సైతం పుట్టగొడుగులు ఉపయోగపడతాయని హైద‌రాబాద్‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ సెల్యూల‌ర్ అండ్ మాలిక్యూల‌ర్ బ‌యాల‌జీ - చెబుతోంది.

పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అలాగే, బీటా గ్లూకాన్స్ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంగా తీసుకుంటే... కరోనాకు చెక్ పెట్టొచ్చంటున్నారు సీసీఎంబీ  పరిశోధనకులు. పుట్టగొడుగులతో తయారు చేసిన ఆహార పదార్థాలు... కరోనా వైరస్‌కు తక్షణ విరుగుడుగా ఉపయోగపడతాయని తమ పరిశోధల ద్వారా తేల్చారు.

అటల్ ఇంక్యుబేషన్‌లోని స్టార్టప్ సంస్థ క్లోన్ డీల్స్‌తో కలిసి సీసీఎంబీ పరిశోధనలు చేసింది. ఔషధ ఆహార ఉత్పత్తి సంస్థ ఆంబ్రోషియా ఫుడ్ ఫామ్‌తో కలిసి పుట్టగొడుగులతో చేసిన సప్లిమెంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయోగాలు చేపట్టింది. పుట్టగొడుగుల్లోని కార్డిసెప్స్, కర్కమిన్‌తో కలిసి ద్రవ రూపంలో ఈ ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. పసుపు మిశ్రమంతో కలిసిన ఈ ఆహారం ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంతో పాటు యాంటీ ఆక్సిడెంటుగా పనిచేసి, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా కట్టడిలో మెరుగైన ఫ‌లితాలిచ్చే టీకా అందుబాటులోకి రావ‌డానికి చాలా స‌మ‌యంతో పడుతుంది. ఈ పరిస్థితుల్లో కరోనా మ‌హ‌మ్మారిని కట్టడి చేయడానికి యాంటీ వైరల్ ఔష‌ధ ఆహారంపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాయి ప‌లు సంస్థలు. పుట్టగొడుగుల ఫుడ్ సప్లిమెంట్స్‌పై సీసీఎంబీతో కలిసి ఎయిమ్స్ పరిశోధనలు చేస్తోంది. ఎయిమ్స్ నాగ్‌పూర్, భోపాల్, నవీ ముంబై కేంద్రాల్లో ఈ ప్రయోగాలు సాగుతున్నాయి. వచ్చే ఏడాది తొలి నాళ్లలో ఈ ఫుడ్ సప్లిమెంట్స్‌ మార్కెట్లో అందుబాటులోకి  వచ్చే అవకాశం ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: