కడప జిల్లా గండికోట రిజర్వాయర్ నిర్వాసితులను కష్టాలు, నష్టాలు వెంటాడుతున్నాయి.  పరిహారం లేక, పునరావాసం అందక ఇబ్బందుల్లో ఉన్న నిర్వాసితులకు.. చేతికొచ్చిన పంట కూడా నీటిపాలు కావడంతో కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ప్రాజెక్టు కోసం అన్నీ త్యాగం చేసిన తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

గండికోట రిజర్వాయర్‌లో సాధ్యమైనంత మేరకు నీటిని నింపాలన్న ప్రభుత్వ ప్రయత్నం నిర్వాసితులకు కష్టాలు తెస్తోంది. నాలుగురోజుల్లో కోత కోయాల్సిన వెయ్యి ఎకరాల్లో వరి పంట మొత్తం నీట మునిగింది. ఇప్పటికే ప్రాజెక్టు ముంపునకు గురైన తమకు పరిహారం, పునరావాసం కల్పించాలని పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో చేతికొచ్చిన పంట కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

గాలేరు నగరి సృజల స్రవంతి ప్రాజెక్టులో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్ లో కృష్టానది నుంచి వచ్చే నీటితో నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 26 టీఎంసీల సామర్ధ్యం కలిగిన ప్రాజెక్టులో ఇప్పటికే 17 టిఎంసిల నీటిని నిల్వచేశారు. ఇప్పటికే ప్రాజెక్టు ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. తమకు పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్నారు.. అయినా ప్రభుత్వం, అధికార యంత్రాగం పట్టించుకోని పరిస్థితుల్లో మునిగిన ఇళ్లలోనే కాలం గడుపుతూ సాగు చేసిన పంటను కాపాడుకుంటూ వస్తున్నారు.

మరో నాలుగు రోజుల్లో పంట కోతలు పూర్తయితే సొమ్ము వస్తుందనుకున్నారు. అయితే  అధికారులు నీటిని ఎక్కువగా నిల్వ చేయడంతో సాగు చేసిన పంట మొత్తం నీట మునిగిపోయింది.. దీంతో నిర్వాసితుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.  ముంపునకు గురువుతున్న తాళ్లప్రొద్దుటూరు, సామలూరు , ఎర్రగుడి గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో సాగు చేసిన పంట మొత్తం నీళ్లపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేసున్నారు.

నిర్వాసితులపట్లు ప్రభుత్వం కక్ష సాధిస్తోందని, పంటను కూడా దక్కకుండా ఇబ్బందులు పెడుతోందని స్ధానికులు ఆరోపిస్తున్నారు. పంట కోతలయ్యే వరకూ నీటి నిల్వను తగ్గించాలని కోరినా.. అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. తీవ్రంగా నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: