దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నా.. అవినీతి మరక అంటని వికాస్ పురుషుడు నితీశ్ కుమార్. రాజకీయ వ్యూహాల్లో ఆధునిక చాణక్యుడు. ఒక రైలు ప్రమాదానికి బాధ్యత వహించి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన చివరి నేత ఆయనే కావచ్చు. నీతీశ్‌ది నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం.
1951 మార్చి 1న పరమేశ్వరి దేవి, కవిరాజ్ రామ్‌లఖన్‌సింగ్‌కు నితీశ్ జన్మించారు. 1973 ఫిబ్రవరి 22న మంజుకుమారి సిన్హాను వివాహం చేసుకున్నారు. ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. వారిద్దరి ఏకైక సంతానం నిశాంత్ కుమార్. నితీశ్ కుమార్ కుమారుడు ఉద్యోగంలో స్థిరపడ్డారు. నితీశ్ సతీమణి మంజుకుమారి 2007లో అనారోగ్యంతో మరణించారు.
నితీశ్ రాజకీయ జీవితం 45 ఏళ్ల క్రితం విద్యార్థి సంఘాలతో మొదలైంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జేపీ చేపట్టిన పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. బీహార్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా తీసుకున్న నీతీశ్.. ఆ తర్వాత రాష్ట్ర విద్యుత్‌బోర్డులో కొంత కాలం పాటు ఉద్యోగం చేశారు. రాజకీయాల మీద ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేశారు. ఎన్నికల్లో పోటీ చేసి రెండు సార్లు ఓడిపోయినా వెనక్కి తగ్గలేదు. 1985 ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టారు.
జనతాదళ్‌లో ఇమడలేక జార్జి ఫెర్నాండేజ్‌తో కలిసి సమతా పార్టీని స్థాపించారు. 2003లో శరద్‌యాదవ్ జనతాదళ్ వర్గం, సమతా పార్టీ, రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో లోక్‌శక్తి కలిసి జనతాదళ్ యునైటెడ్ పార్టీగా ఏర్పాటైంది. ఆ తర్వాత నితీశ్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. 1989లో తొలిసారి ఎంపీగా గెలిచారు. 1991, 96, 98, 99, 2004లలోనూ ఎంపీగా ఎన్నికయ్యారు. 1998-99లో వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పదవిని చేపట్టారు. అనంతరం రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇంటర్నెట్ ద్వారా రైల్వే టికెట్లు బుకింగ్, తత్కాల్ సేవలు, పెద్ద సంఖ్యలో రైల్వే బుకింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి సంస్కరణలు నితీశ్ ప్రవేశ పెట్టినవే. 2004లో ఎన్డీయే అధికారం కోల్పోయాక నితీశ్ బీహార్‌పై దృష్టిపెట్టారు. 2005లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ బీజేపీతో కలిసి అధికారంలోకి రావడంతో.. నీతీశ్ సీఎంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిన నితీశ్‌ను బీహార్ ప్రజలు అప్పటి నుంచి ఆశీర్వదిస్తూనే ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి