నూతన వ్యవసాయ చట్టాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెబుతున్న కేంద్రం.. చట్టాలకు అనుకూలంగా ప్రచారాన్ని ఉదృతం చేయాలని నిర్ణయించింది. రైతుల ఆందోళన తీవ్రం అవుతున్న తరుణంలో ప్రధానమంత్రి మోడీ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 25న వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని రైతులతో ముచ్చటించనున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల లాభాల గురించి ప్రధానమంత్రి రైతులతో చర్చించే అవకాశం ఉంది. చట్టాలపై అవగాహన కల్పించేలా యూపీలో 2500లకు పైగా ప్రాంతాల్లో కిసాన్ సంవాదక్ కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.
రైతులను ఎలాగైనా ఒప్పించాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ హిందీలో రైతు సంఘాలకు రాసిన 8 పేజీల లేఖను 9 ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, ఒడియా భాషల్లోకి ఈ లేఖను తర్జుమా చేశారు. బీజేపీ అధికారంలో లేని మెజారిటీ రాష్ట్రాల్లో దీన్ని షేర్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఈ లేఖను పంపడం ద్వారా ఆయనే దీనిని జాతీయ అంశంగా మార్చేశారన్న వాదన వినిపిస్తోంది.
చట్టాల విషయంలో ముందుకే వెళ్లాలని ప్రధాని మోడీ నిర్ణయించడంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు తమను ప్రతిపక్షాలతో ముడి పెట్టి విమర్శిస్తున్నారని.. బీజేపీ సోషల్ మీడియాలో ఆందోళన చేస్తున్న రైతుల్ని దేశ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. రైతులపై మోడీ సర్కార్‌కు సానుభూతి ఏమాత్రం లేదని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ మండిపడింది. నరేంద్రమోడీ ప్రధానిలా కాకుండా.. బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి