ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో ఏపీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు షాక్ ఇచ్చింది. అసలు ఆ పదమే కొత్తగా ఉందని ఏపీ హైకోర్ట్ చెప్పడం చాలా మందిని షాక్ కి గురి చేసింది. ఇక దీని పై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేసారు. దీనిపై పలువురు నేతలు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ... పంచాయతీ ఎన్నికల అంశం పై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుని స్వాగతించి,  ప్రభుత్వ ఘనతగా చెప్పుకున్న మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నేడు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని కూడా సంతోషంగా స్వాగతించాలి అని ఆయన సూచించారు.

ప్రజా రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని పాలకులు చేసిన దుష్ప్రచారమంతా కట్టు కథేనని కోర్టు తీర్పుతో తేలిపోయింది అని ఆయన అన్నారు. సిఎం వైఎస్ జగన్ తన అధికారయంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతపై, టీడీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని కిలారి రాజేశ్ వ్యవహారంతో బట్టబయలైంది అని అన్నారు ఆయన. పాలకులు మోచేతి నీళ్లు తాగే వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఐపీసీ చట్టాల పరిధిలోకి రాదని హైకోర్టు స్పష్టంగా చెప్పడంపై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెబుతారు? అని ఆయన నిలదీశారు.

సంబంధం లేని వ్యక్తులతో రాజకీయ క్రీడ ఆడుతున్న ప్రభుత్వం అమరావతిని నాశనం చేసి, విశాఖలోని భూములను అమ్ముకోవడానికే ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేసిందని కోర్టు తీర్పుతో స్పష్టమైంది అని ఆలపాటి రాజా అన్నారు. హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రికి ఏ మాత్రం గౌరవమున్నా, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు. కాగా అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాలని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: