హైదరాబాద్‌: ఈ ఏడాది పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు 18 రోజులు మాత్రమే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. వచ్చే విద్యా సంవత్సరం (2021-22) యథాతథంగా ప్రారంభం అవుతుందని పేర్కొంది. గత విద్యా సంవత్సరం జూన్‌ 12న మొదలవగా.. కొత్త విద్యా సంవత్సరం రెండు రోజులు ఆలస్యంగా అంటే ఈ ఏడాది జూన్‌ 14న ప్రారంభం అవనుంది. పదో తరగతి పరీక్షలను మే 17 నుంచే నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్‌ పరీక్షలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇక వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు నిబంధనల ప్రకారం ఉండాల్సిన హాజరు శాతం ఈసారి తప్పనిసరి కాదని సర్కారు పేర్కొంది.

హాజరు శాతం లేనికారణంగా ఒక్క విద్యార్థిని కూడా వార్షిక పరీక్షలకు దూరం పెట్టకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అకడమిక్‌ కేలండర్‌ను శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈసారి కరోనా నేపథ్యంలో ఏటా బడుల ప్రారంభానికి ముందు జూన్‌ మొదటి వారంలో చేసే ప్రకటనకు భిన్నంగా ఎనిమిది నెలలు ఆలస్యంగా కేలండర్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి ఉన్నత పాఠశాలల్లో 9, 10వ తరగతులకు పాఠాలు బోధించాలని సర్కారు ఆదేశించడంతో ఈ రెండు తరగతుల విద్యార్థులకే ఈ అకాడమిక్‌ కేలెండర్‌ వర్తించనుంది.

సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో తరగతులు మొదలవగా జనవరి 30 వరకు 115 తరగతులు పూర్తవుతాయి. తాజాగా అకడమిక్‌ కేలండర్‌ మేరకు 89 రోజులపాటు పాఠశాలలు కొనసాగనున్నాయి. దీంతో మొత్తంగా ఆన్‌లైన్‌ తరగతులు, ప్రత్యక్ష బోధనా తరగతులను కలుపుకొని ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 204 పనిదినాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఏప్రిల్‌ చివరి వరకు సిలబస్‌ పూర్తిచేసి, మే నెల 1వ తేదీ నుంచి క్లాసులు రివిజన్‌ చేయనున్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే సెలవులు ఎక్కువగా ఉండటంతో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో జరగనున్న తరగతుల్లో రెండోశనివారం కూడా పాఠశాలలు కొనసాగనున్నాయి.

  

మరింత సమాచారం తెలుసుకోండి: