టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను తీర్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు కర్నూలు జిల్లాలోని పెసరవాయి గ్రామానికి చేరుకొని ఇటీవల హత్యకు గురైన టీడీపీ నేతలు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డిల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ నేతల పై సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ వేదికగా మళ్లీ వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు.



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డూబు రెడ్డి గా నారా లోకేష్ సంబోధించారు. జగన్ కి సంబంధించిన ఒక వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. డూబు రెడ్డి ఉత్తుత్తి ఉద్యోగాల డాబు కాలెండ‌ర్ విడుదల చేసారని ఆయన జగన్ ని ఎద్దేవా చేశారు. 2ల‌క్ష‌ల 30 వేల‌కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతీయువకులను దారుణంగా మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సంస్థను గవర్నమెంట్ లో విలీనం చేసుకున్న తర్వాత.. 54వేల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చామని చెబుతూ మోసపు ప్రకటనలు విడుదల చేశారని ఆయన వైసీపీ సర్కార్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.



వాలంటీర్ల ఉద్యోగాల నియామకాలపై కూడా నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. వార్డు/గ్రామ‌స‌చివాల‌యల్లో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మాత్రమే వాలంటీర్ల జాబులు ఇచ్చి హడావిడి చేస్తున్నారని.. వైయస్సార్సీపి కి దొంగ ఓట్లు వేయించే వైసీపీ కార్య‌క‌ర్త‌లను వాలంటీర్లుగా నియమించడం లో ఎలాంటి వివ‌క్ష లేదంటారా? అని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.



వార్డు, గ్రామ‌స‌చివాల‌య ఉద్యోగ భ‌ర్తీ ఎగ్జామ్ పేపర్ అమ్మేశారని.. అలా చేస్తే అవినీతికి తావులేకుండా ఉద్యోగాలు భర్తీ చేసినట్లు అవుతుందా? అని లోకేష్ ప్రశ్నించారు. జాబులు అమ్ముకోవడాన్ని మీ భాషలో అత్యంత పారదర్శకత అని పిలుస్తారా? అని లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: