కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న అమిత్ షా పర్యటిస్తారని వెల్లడించాయి. ఇందుకోసం నిర్మల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. నిర్మల్ లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి వెయ్యి మందికి పైగా ప్రజలు అమరులైన ప్రాంతం ఉన్నందున అక్కడే సభ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు హుజూరాబాద్ లో నాయకులను కొనచ్చు కానీ.. ప్రజలను కొనలేరని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. నాయకులు అమ్ముడు పోయినా.. ప్రజలు అమ్ముడు పోరని చెప్పారు. దళితవాడకు వెళ్లి ఇంటికో 10లక్షల రూపాయలు ఇస్తాం.. గులాబీ కండువా కప్పుకోవాలని టీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారనీ విమర్శించారు. తన రాజీనామా వల్లే ఆగిపోయిన అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
అంతేకాదు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జమ్ముకశ్మీర్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం డిసెంబర్ 10నుంచి జమ్ముకశ్మీర్ లో ప్రత్యేకంగా పర్యటించాలని కేంద్ర మంత్రులను ఆదేశించారు. ఈ టాస్క్ కోసం 70మంది కేంద్ర మంత్రుల జాబితాను మోడీ తయారు చేయించారు. వీరు 9సార్లు జమ్ముకశ్మీర్ ను చుట్టి రావాలన్న నిబంధనను కూడా విధించారు. జమ్ముకశ్మీర్ లోని ప్రజలతో మమేకం కావాలని మోడీ ఆదేశించారు.
వికారాబాద్ శివారు నుంచి 8వ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుండగా.. మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ ఈ యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణలో పోరాటం ప్రారంభమైందనీ.. ప్రజలు సంజయ్ కు మద్దతుగా నిలవాలని కోరారు. టీఆర్ఎస్ తో బీజేపీకి ఎప్పుడూ దోస్తీ ఉండదన్నారు. అంతేకాదు బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు ఫడ్నవీస్.
ఇక హుజురాబాద్ ఉపఎన్నికను ఇప్పుడే నిర్వహించేందుకు సిద్ధంగా లేమని తెలంగాణ ప్రభుత్వం ఈసీకి తెలిపింది. కరోనా కట్టడి కాకపోవడంతో దసరా తర్వాత ఈ ఎన్నిక నిర్వహించాలని కోరింది. దీంతో తాజాగా దేశంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికల తేదీలు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. హుజూరాబాద్ ను అందులో పేర్కొనలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి