గుంటూరు జిల్లాలో అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. వ్యవసాయం కోసం చేసిన అప్పులు గుదిబండగా మారడంతో రైతన్నలు కోలుకోలేని స్థితికి వెళుతున్నారు. అసలే కౌలు పొలాలు, వాటిల్లో అప్పులు చేసి వ్యవసాయం చేయడం పెనుభారంగా మారుతోంది. కౌలు ముందే చెల్లించడం, పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలు కౌలు సాగుదారులకు భారంగా మారాయి. సరైన దిగుబడి రాకపోవడం, వచ్చిన దిగుబడి కి గిట్టుబాటు ధరలు లేకపోవటం రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీంతో అప్పుల వారికి సమాధానం చెప్పుకోలేక , ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.

జిల్లాలో రెండు రోజుల వ్యవధిలోనే నలుగురు  రైతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తాడికొండ నియోజకవర్గంలోని పొన్నెకల్లు గ్రామానికి చెందిన కౌలు రైతు దేశబోయిన శ్రీనివాసరావు అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి ఆసుపత్రిలో చివరి పొందుతూ మృతి చెందాడు. మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం పెదకొండూరుకు చెందిన కౌలు రైతు కొండూరు ఫ్రాన్సిస్‌ శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన దాదాపు 16 ఏళ్లుగా మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇందుకోసం దాదాపు రూ. 5 లక్షలు అప్పు చేశాడు. నాలుగేళ్లుగా దిగుబడి రాకపోవడంతో వచ్చిన నష్టాలతో పాటు వ్యవసాయం కోసం చేసిన అప్పుల తీర్చలేకపోయాడు. దీంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలం నరసింగపాడులో కౌలు రైతు బత్తుల వెంకటసుబ్బారావు (55) పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన గత మూడేళ్లుగా 20 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, మిర్చి సాగు చేశాడు. పెట్టుబడుల కోసం సుమారు రూ. 45 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటసుబ్బారెడ్డి వినాయకచవితి రోజునే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా దాచేపల్లి మండలం శ్రీనగర్‌  గ్రామానికి చెందిన కౌలు రైతు మేకల వెంకయ్య శనివారం ఇంట్లో పురుగుమందు తాగాడు.  రెండు సంవత్సరాల నుంచి ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప పంటలను సాగు చేస్తున్నాడు. దాదాపు రూ.15 లక్షలకు పైగా అప్పు చేశాడు. ఈ ఏడాది పత్తి, మిరప పంటను సాగు చేయగా కురిసిన వర్షాలతో పత్తి పంట పూత, పిందె రాలిపోగా మిరప పంట దెబ్బతింది. రుణ దాతల నుంచి ఒత్తిడిని తట్టుకోలేక పురుగుమందు తాగి బలవన్మరణం పొందాడు.

గుంటూరు జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో నలుగురు రైతులు ఆత్మహత్యలు చోటుచేసుకున్నప్పటికీ.. ఏ రాజకీయ పార్టీ పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తుంది. అత్యాచార ఘటనలపై చూపించిన శ్రద్ధ.. అన్నదాతల సమస్యలు, ఆత్మహత్యల ఘటనలపై కూడా చూపించాలని బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: