కరోనా మహమ్మారి ఇంకా తొలగిపోలేదని.. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఇప్పటికీ వారానికి 50వేల కరోనా మరణాలు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్నాయని గుర్తు చేశారు డబ్ల్యూహెచ్ ఓ చీఫ్. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి తగ్గిపోయిందని భావించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కరోనాను అంతం చేయడానికి వనరులున్నా.. ప్రపంచం వాటిని సరిగా ఉపయోగించుకోలేదని పేర్కొన్నారు.

డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరించిందో లేదో.. ఆ విధంగానే మధ్యప్రదేశ్ లో కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇండోర్ లో ఆరుగురికి AY.4 వేరియంట్ సోకినట్టు అక్కడి వైద్య వర్గాలు తెలిపాయి. బాధితులంతా వ్యాక్సిన్ రెండు డోలుసు తీసుకున్నప్పటికీ వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే దేశంలో AY.4 వేరియంట్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అయితే వైరస్ బారినపడినవారు చికిత్స తర్వాత కోలుకున్నారు.

కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా మళ్లీ లాక్ డౌన్ లు విధిస్తోంది. చైనాలో 11 ప్రావిన్స్ లలో భారీగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర చైనాలోని గాన్సు, ఇన్నర్ మాంగోలియా, గుయిజౌ, బీజింగ్ లలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలు మూసివేశారు. రాజధాని బీజింగ్ లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.

అటు రష్యాలోనూ తీవ్రరూపం దాలుస్తోంది. నిన్న ఒక్కరోజే 38వేల కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఆ దేశంలో ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా వైరస్ తో 1,064మంది మరణించారు. మరోవైపు చైనాలో డెల్టా వేరియంట్ దడ పుట్టిస్తోంది. దేశంలోని 11 ప్రావిన్సుల్లో వేగంగా వ్యాపిస్తోంది.


 మొత్తానికి కరోనా ప్రభావం ఇంకా తొలగిపోలేదనీ.. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా ప్రజలు పాటించేలా చూడాలని దేశాధినేతలను  హెచ్చరిస్తోంది.









మరింత సమాచారం తెలుసుకోండి: