విశాఖ పట్నం.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అరాచకాలు జరుగుతుంటే.. ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గ నేతలు అంతా కళ్లు మూసుకుంటున్నారా.. అవునంటున్నారు టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు.. విశాఖ నగరంలో జరుగుతున్న అరాచకాలు అడ్డుకునే ధైర్యం లేదా అని ఆయన విశాఖకు చెందిన నేతలను ప్రశ్నిస్తున్నారు.


విశాఖలోని సముద్రం వెంబడి.. రుషికొండపై ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారని.. కోస్తా నియంత్రణ మండలి-1 పరిధిలో ఆ ప్రాంతం ఉన్నా.. ఎలాంటి అనుమతులు లేకున్నా రుషికొండను పిండి చేస్తున్నారని అయ్యన్న అంటున్నారు. ఈ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు అవసరమని.. కానీ అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కి పనులు చేపడుతున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.


రుషికొండను పిండి చేయడంపై అధికార గణం నోరు మెదపడం లేదని.. గనుల శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకముందే కొండ తవ్వకాలు జరుపుతోందని అయ్యన్న అంటున్నారు. ఆ మట్టిని తీసుకువెళ్లి బీచ్‌లలోనే పోస్తున్నారని.. రుషికొండపై నిర్మాణాల కోసం అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని.. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారని అయ్యన్న విమర్శిస్తున్నారు. రుషి కొండను మొత్తం తవ్వేస్తున్నారంటున్న అయ్యన్న..  దిగువన బీచ్‌ రోడ్డులో గీతం విశ్వవిద్యాలయం ఎదురుగా రూ.80 లక్షలతో నిర్మించిన బస్టాప్‌ను నేలమట్టం చేసేశారని గుర్తు చేశారు.


అసలు ఈ ప్రాంతమంతా కోస్తా నియంత్రణ మండలి-1 పరిధిలో ఉందని... శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ప్రత్యేకంగా అనుమతులు ఉండాలని అయ్యన్న అంటున్నారు. ఇంత దారుణం జరుగుతున్నా.. ఎవరూ నోరు మెదపడం లేదని.. అందరినీ అధికార పార్టీ భయభ్రాంతులకు గురి చేసి.. నోరు నొక్కేస్తుందని అయ్యన్న మండిపడ్డారు. ఇకనైనా ఈ ప్రాంతానికి చెందిన నేతలు, మేధావులు గళం విప్పకపోతే.. విశాఖకు తీరని అన్యాయం జరుగుతుందని అయ్యన్న హెచ్చరిస్తున్నారు. మరి అయ్యన్న పిలుపుతో ఎందరు నేతలు ముందుకు వస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: