సాధారణంగా రాజకీయ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలతో బిజీ బిజీగా ఉంటారు. ఇక ముఖ్యంగా అధికార పార్టీ నేతలు అయితే... ప్రతిపక్షాలపైకి ఒంటికాలితో దూకుతారు కూడా. తాము ఎన్ని మంచి పనులు చేసినా కూడా... ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయని ఆరోపిస్తారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతలు పర్యటనలు చేస్తే మాత్రం వాటిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతమైన చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికే చెరువులు కట్టలు తెంచుకున్నాయి. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని ఇప్పటికే విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. అటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కూడా.

తిరుపతిలోని రాయల చెరువు పూర్తిగా నీటితో నిండిపోయింది. చెరువు కట్ట తెగిపోతుందని ఇప్పటికే స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రాయల చెరువు ప్రాంతాన్ని సీపీఎం జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పరిశీలించారు. చిత్తూరు జిల్లాని రామచంద్రాపురం మండలం కుప్పంబాదురు నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరం కాలినడకన పర్యటించారు. రాయల చెరువు పరిసరాలను పరిశీలించారు. ఈ సమయంలో బురద కారణంగా కాలు జారి కింద పడిపోయారు నారాయణ. ఈ ఘటనలో నారాయణ కాలు బెణికింది. ఇదే సమయంలో రాయల చెరువును పరిశీలించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నారాయణ కాలు బెణికిన విషయం తెలుసుకున్న ఎంపీ గురుమూర్తి... ఆయన కాలుకు కట్టుకట్టారు. ఫిజియో థెరపిస్ట్ కావడంతో... కాలుకి మర్ధనా చేశారు. ఆ తర్వాత తన కారులోనే నారాయణను తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. తాను వృత్తి రీత్యా వైద్యుడినని... రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: