ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది..ఇది విపక్షాలు తరచూ చెప్పే మాట.. విపక్షాలు అంటే.. అంతే కదా.. ప్రభుత్వాన్ని విమర్శించడమే వాటి పని కదా అనుకోవచ్చు.. కానీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వంటి మేధావులు కూడా ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి బెంగ పెట్టుకుంటున్నారు. రాష్ట్రం అప్పుల పాలైపోతోందని బెంగపెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని నేరుగా జగన్‌నే అడుగుతున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్..


జగన్ రాజకీయాల్లోకి రాకముందే ఓ విజయవంతమైన వ్యాపార వేత్త అన్న విషయాన్ని గుర్తు చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్.. ఆయన దగ్గర రాష్ట్రాన్ని ఒడ్డున పడేసే మార్గం ఏదో ఒకటి ఉండే ఉంటుందని ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమర్థవంతమైన వ్యాపారవేత్త అంటున్న  ఉండవల్లి.. అలాంటి జగన్..  రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడం లేదని విమర్శిస్తున్నారు. పోనీ.. ఆయన వద్ద రాష్ట్రాన్ని గట్టెక్కించే ఉపాయం ఏదైనా ఉంటే కాస్త చెప్పి పుణ్యం కట్టుకోవాలని సెటైర్లు వేస్తున్నారు.


జగన్‌ అడిగినదాని కంటే ప్రజలు ఎక్కువ సీట్లు ఇచ్చి చక్రవర్తిని చేశారని.. ప్రజల ఆశలను జగన్ నెరవేర్చాలని ఉండవల్లి అంటున్నారు. జగన్.. ప్రత్యేకహోదా, పోలవరం నిధులు ఏమీ  సాధించలేక పోయారని రాష్ట్ర పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ విమర్శించారు. రాష్ట్రానికి దారుణమైన అన్యాయం జరుగుతున్నా రాజకీయాల కోసం నోరు మెదపని పరిస్థితి ఉందని ఆయన జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు.


ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మొదటి నుంచి వైఎస్‌ అనుచరుడుగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన ఎంపీ కూడా అయ్యారు. వైఎస్‌కు గట్టి మద్దతుదారుడైన ఉండవల్లి మొదట్లో జగన్‌కు అనుకూలంగానే ఉన్నారు. అయితే.. లాజిక్‌, వాదనాపటిమ ఉన్న ఉండవల్లి ఇటీవలి కాలంలో జగన్ ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తున్నారు. తనకు రాష్ట్రమే ముఖ్యమని.. నాయకులు కాదని తరచూ అనే ఉండవల్లి మాటలను మరి జగన్ చెవికెక్కించుకుంటారా..? ఆ సీక్రెట్‌ ఏదైనా ఉండే కనీసం ఉండవల్లికైనా చెబుతారా.. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: