గణపతి తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న నంబాల కేశవరావు ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించారన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. మళ్లీ గణపతికే బాధ్యతలు అప్పగిస్తారా? లేక సీనియర్లు మల్లోజుల వేణుగోపాల్ (సోను) లేదా తిప్పిరి తిరుపతి (దేవ్‌జీ)లలో ఒకరికి చాన్స్ దొరుకుతుందా? అనేది హాట్ టాపిక్. ఇంతకీ ఈ ఎన్నికల తతంగం ఎలా ఉంటుందో చూద్దాం.

మావోయిస్టు పార్టీ బాస్ ఎన్నిక అత్యంత రహస్యం. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో బయటి ప్రపంచానికి అస్సలు తెలియదు. కానీ, పార్టీ సెంట్రల్ కమిటీ (సీసీ) సభ్యులే సుదీర్ఘంగా చర్చించి, ప్రజాస్వామ్య పద్ధతిలోనే కొత్త లీడర్‌ను ఎన్నుకుంటారని మాజీల మాట. ఈ సీసీనే పార్టీకి బ్రెయిన్ లాంటిది, కీలక నిర్ణయాలన్నీ ఇక్కడే ఫైనల్ అవుతాయి.

మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో సభ్యులెంత మంది ఉన్నారనేది ఓ మిస్టరీనే. 2004లో పార్టీ ఏర్పడినప్పుడు 34 నుంచి 42 మంది దాకా ఉండేవారట. కానీ ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, అనారోగ్య సమస్యలతో ఈ సంఖ్య తగ్గిందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ప్రస్తుతం 18 మంది వరకు ఉండొచ్చని, వీరిలో 10-12 మందే చురుగ్గా ఉన్నారని టాక్. తాజా సమాచారం ప్రకారం, సీసీలో కీలక సభ్యులు ఎవరంటే ముప్పాల లక్ష్మణరావు (గణపతి), మల్లోజుల వేణుగోపాల్ రావు (సోను, అభయ్), మిసిర్ బెస్ట్సా, తిప్పర్తి తిరుపతి (దేవ్‌జీ), గాజర్ల రవి (ఉదయ్‌), కడారి సత్యనారాయణ రెడ్డి (కోసా), పాకా హనుమంతు (గణేశ్ ఉయికే), పుల్లూరి ప్రసాద్ రావు (చంద్రన్న), మల్లా రాజి రెడ్డి, మెడెం బాలకృష్ణ.

కొత్త బాస్‌ను ఎన్నుకోవడంలో సెంట్రల్ కమిటీ, దానిలో నుంచి ఏర్పడే చిన్న బృందం పొలిట్‌బ్యూరో చక్రం తిప్పుతాయి. పార్టీ చీఫ్‌గా ఎవరుండాలనే దానిపై లోతుగా చర్చిస్తారు. అందరూ ఓకే అనేంతవరకు చర్చలు సాగుతాయి. ఏకాభిప్రాయం కుదరకపోతే మాత్రం సీక్రెట్ ఓటింగ్. సీసీ, పొలిట్‌బ్యూరో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకుని పార్టీ సారథిని ఎన్నుకుంటారు.

మావోయిస్టు పార్టీని నడిపించే లీడర్‌ను ఎన్నుకునేది రహస్యంగానే అయినా, కొన్ని పక్కా లెక్కలుంటాయి. పార్టీ సిద్ధాంతాలపై పూర్తి పట్టు, పార్టీ నిర్మాణంలో సూపర్ స్కిల్స్ ఉండాలి. గతంలో అప్పగించిన పనుల్లో సక్సెస్ రేటు, నాయకత్వ లక్షణాలు కూడా లెక్కలోకి తీసుకుంటారు. అజ్ఞాతంలో పార్టీని నడిపించడానికి, బలోపేతం చేయడానికి ఎలాంటి మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయో కూడా చూస్తారు. శత్రువుపై చేసిన దాడులు, భవిష్యత్ వ్యూహాలపై ఆ నేత అనుభవాన్ని సీసీ సభ్యులు పరిశీలిస్తారు.

కొత్త బాస్ ప్రకటన కూడా సీక్రెట్టే..

అన్ని విషయాల్లాగే, మావోయిస్టు పార్టీ తమ కొత్త బాస్ ఎవరనేది కూడా అత్యంత రహస్యంగా ఉంచుతుంది. ఎన్నిక పూర్తయ్యాక, కొత్త సారథి పేరును పార్టీ రాష్ట్ర, జోనల్, ఏరియా కమిటీలకు, పార్టీ దళాలకు అంతర్గతంగా కొరియర్ల ద్వారా చేరవేస్తారు. మరోవైపు, పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తమ కోవర్టులు, ఇతర నెట్‌వర్క్‌ల ద్వారా ఈ మార్పును పసిగట్టే ప్రయత్నం చేస్తాయి. కొన్నిసార్లు పార్టీని వీడిన వాళ్లు లేదా కొరియర్ల ద్వారా మీడియాకు ఈ విషయం లీక్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: