
అయితే ఈ ఏడాది తోతాపురి మామిడి కాపు భారీగా ఉండటంతో, సరైన ధర రావడం లేదని రైతులు గగ్గోలు పెట్టారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు పరిసర ప్రాంతాల్లో తోతాపురి మామిడి కిలో ధర రూ. 8 గా ప్రకటించింది. అదనంగా రూ. 4 సబ్సిడీ కలిపి రూ. 12/కేజీ తాకమైన మద్దతు కల్పించడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ, కర్ణాటకలో కిలో ధర కేవలం రూ. 5 నుండి రూ. 6 మాత్రమే ఉండటంతో.. ప్రాసెసింగ్ యూనిట్లు చౌకగా వచ్చే కర్ణాటక మామిడిని వలసగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది రైతుల ఆదాయాన్ని తీవ్ర నష్టపరుస్తుంది.
ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా కలెక్టర్ కర్ణాటకతో సహా పొరుగు రాష్ట్రాల నుంచి తోతాపురి మామిడి పండ్ల దిగుమతిని నిషేధిస్తూ జూన్ 7న ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ విధించిన ఆదేశం ప్రకారం.. అటవీ, రెవెన్యూ, పోలీసు, మార్కెటింగ్ శాఖలతో కూడిన బృందాలు కీలక సరిహద్దు చెక్ పోస్టుల వద్ద విధిగా నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఏపీ సర్కార్ చేపట్టిన ఈ చర్యలపై కర్ణాటక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాశారు. మామిడిపై నిషేధాన్ని ఏకపక్షంగా తీసుకున్న చర్య అని.. ఇది ఫెడరలిజానికి విరుద్ధంగా ఉందని సీఎం సిద్ధరామయ్య లేఖలో పేర్కొన్నారు. చిత్తూరులోని ప్రాసెసింగ్ యూనిట్లపై ఎన్నో ఏండ్లుగా కర్ణాటకలోని మామిడి రైతులు, ముఖ్యంగా తోతాపురి మామిడిని పెద్ద మొత్తంలో సాగు చేసే సరిహద్దు ప్రాంతాల రైతులు ఆధారపడి ఉన్నారని.. కానీ ఏపీ తాజాగా విధించిన నిషేధంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిద్ధరామయ్య తెలిపారు. వేలాది మంది రైతుల జీవనోపాధిని నేరుగా ప్రభావితం చేస్తున్న ఈ నిషేధాన్ని వెంటనే రద్దు చేయాలని.. లేదంటే ఇరు రాష్ట్రాలకు మధ్య ఉద్రిక్తత మరియు ప్రతీకార చర్యలు కలిగించవచ్చని హెచ్చరించారు. దీంతో ఈ విషయంపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.