- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రుల వ్యవహారశైలి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. “ఏపీలో ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క స్టోరీ ఉంది” అన్న విష‌య‌మే ఇప్పుడు బిగ్ హాట్ టాపిక్‌గా మారింది. ఇది ప్రతిపక్షాల మాట కాదు. పార్లమెంట్ లాబీల్లో తెలంగాణ, ఏపీకి చెందిన ఎంపీలు తమ మధ్య మాట్లాడుకున్నప్పుడు ఈ మాట వినిపించడం విశేషం. గత సంవత్సరం కొంతకాలం మౌనం పాటించిన మంత్రులు, తరువాత తమ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ, పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నా, లోపల మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ లాంటి ప్రతిపక్షాలు మంత్రులపై వ్యాఖ్యలు చేస్తే పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షాత్తూ తన మంత్రుల్లో కొందరిని ప‌దే ప‌దే హెచ్చరిస్తుండటమే ఈ వ్యవహారంపై అంద‌రూ దృష్టి సారించేలా చేసింది. ముఖ్యంగా రాయలసీమకు చెందిన ఓ మంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూసుకుపోతున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని చంద్రబాబు చెబుతుంటే, ఆ మంత్రి మాత్రం హైదరాబాద్ శివార్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భారీ వెంచర్లు వేస్తున్నారు.


ఇంతటితో ఆగకుండా, ఏపీలో ఉచితంగా ఇచ్చే ఇసుకను పెద్ద ఎత్తున తరలించడం, తెలంగాణలో లారీకి రూ. 20 వేల చొప్పున అమ్మడం పెద్ద వివాదంగా మారింది. ఫ్రీ పేరుతో రేయింబవళ్లు ఇసుక తరలింపు జరుగుతుందని, ఇది తెలంగాణ నాయకులకే కాక, అక్కడి వ్యాపార వర్గాలకు కూడా కంటగింపుగా మారిందని అంటున్నారు. అంతేకాకుండా, సరిహద్దు ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను కూడా ఆ మంత్రి స్వాధీనం చేసుకున్నారన్న వార్తలు చర్చనీయాంశమవుతున్నాయి. ఏపీలో వ్యాపారం చేయడం ఒకవైపు అయితే, తెలంగాణలో కూడా మద్యం వ్యాపారం చేపట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారనేది విమర్శ.


చిత్రం ఏమిటంటే, ఈ మంత్రి తొలిసారిగా చంద్రబాబు టీంలో చేరినా, ఆయనకు మంచి రాజకీయ అనుభవం ఉంది. ఇరురాష్ట్రాల్లోనూ పలు వర్గాలతో సంబంధాలు కలుపుకున్న ఆయనకు తిరుగులేని ప‌ట్టు చిక్కింద‌ని అంటున్నారు. ఈ పరిణామాలు, ఒకవైపు ప్రభుత్వ ప్రతిష్టకు సవాల్‌గా మారుతుండగా, మరోవైపు మంత్రి స్వీయ వ్యాపార ప్రయోజనాలు ప్రధానమవుతున్నాయన్న భావన బలపడుతోంది. మొత్తానికి, ఈ ఒక్క మంత్రి తీరు మాత్ర‌మే కాదు ఏపీ కేబినెల్లో ఉన్న చాలా మంది మంత్రులు సంపాద‌న‌లో ఆరితేరి పోతున్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: