- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

కడప జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినా స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి సతీమణి రెడ్డప్పగారి మాధవి రెడ్డి ప్రవర్తన ఈ వేడుకలకే వివాదాస్పదంగా మారింది. వేదికపై తనకు సీటు ఇవ్వలేదన్న ఆవేదనతో ఆమె నేరుగా అధికార వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రోటోకాల్ ప్రకారం స్వాతంత్య్ర దినోత్సవ వేదికపై జిల్లా మంత్రి, కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ వంటి కీలక వ్యక్తులు మాత్రమే కూర్చోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు సహా మిగిలిన ప్రజా ప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, జిల్లా స్థాయి అధికారులు వీఐపీ గ్యాలరీలో ఆసీనులవుతారు. ఈ నియమావళి ప్రకారమే కడపలోనూ వేదికపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ అదితీ సింగ్ కూర్చున్నారు.


మాధవి రెడ్డి వేదికపై తనకు సీటు లేకపోవడాన్ని గమనించి అసహనం వ్యక్తం చేశారు. గ్యాలరీలో కూర్చోవాలని జాయింట్ కలెక్టర్ అదితీ సింగ్ సలహా ఇవ్వగానే ఆమె భగ్గుమన్నారు. "నాకెందుకు వేదికపై కుర్చీ వేయలేదు?" అంటూ జేసీపై మండిపడ్డారు. ఆ సమయంలో ఆమె ప్రవర్తన కాస్త దూకుడుగా ఉండటంతో, జాయింట్ కలెక్టర్ తాత్కాలికంగా వెనకడుగు వేశారు. పరిస్థితి గమనించిన సిబ్బంది వెంటనే కలెక్టర్ పక్కన మరో కుర్చీ ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వయంగా లేచి ఆమెను వేదికపైకి ఆహ్వానించినా మాధవి రెడ్డి నిరాకరించారు. "థ్యాంక్యూ సార్" అంటూ కోపంగా స్పందించి, గ్యాలరీలో కూర్చోవడానికీ ఒప్పుకోలేదు.


ఫలితంగా, ఆమె తన భర్తతో కలిసి అరగంట పాటు అక్కడే నిలబడి ఉండిపోయారు. అనంతరం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, "ప్రోటోకాల్ పట్ల అవగాహన లేకుండా వ్యవహరించారు" అని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు లోక‌ల్ ఎమ్మెల్యేను గౌర‌వించాలంటున్నారు. ఇంతకు ముందు కూడా మాధవి రెడ్డి కొన్ని వివాదాల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఏదేమైనా ప్ర‌తిసారి ప్రొటోకాల్ విష‌యంలో ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీతో మాధ‌వి రెడ్డి వార్త‌ల్లో హైలెట్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: