
జులై 12న ఒక్కరోజే 4,86,134 లడ్డూలను భక్తులకు అందించినట్లు అధికారులు తెలిపారు. ఇది తిరుమల లడ్డూ ప్రసాదాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. గత ఏడాది ఇదే రోజు (2024 జులై 12)లో 3.24 లక్షల లడ్డూలు అమ్మగా.. ఈ ఏడాది ఒక్కరోజే 35 శాతం పెరిగి దాదాపు 5 లక్షల లడ్డూలు అమ్మడం విశేషం. ఈ అమ్మకాల ద్వారా టీటీడీకి రూ.2.43 కోట్ల భారీ ఆదాయం లభించింది. భక్తుల రద్దీ పెరిగిన కొద్దీ లడ్డూ అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. చిన్న లడ్డూల అమ్మకాలు మాత్రమే గత ఏడాది 1.045 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది 1.25 కోట్లకు పెరగటం తిరుమల ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనం. భక్తుల రద్దీ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి.. టీటీడీ బఫర్ స్టాక్ పేరుతో ఎప్పుడూ 4 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచుతోంది.
దీంతో వచ్చిన ప్రతి భక్తుడు లడ్డూ ప్రసాదం తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఒక్కొక్కరికి లడ్డూలకు సీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు భక్తుల అవసరాలు దాదాపు తీర్చేలా విస్తృతంగా లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నారు. మొత్తం మీద చూస్తే.. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు రికార్డు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. భక్తుల భక్తి, స్వామి వారి కరుణ, టీటీడీ సదుపాయాలు కలిసి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచ ప్రసిద్ధి గాంచేలా చేశాయి. “స్వామి దర్శనం లేకుండా లడ్డూ కాదు.. లడ్డూ లేకుండా తిరుమల ప్రయాణం కాదు” అనే మాట ఎందుకు పుట్టిందో ఈ రికార్డులు మరోసారి రుజువు చేశాయి. శ్రీవారి లడ్డూ మహిమ ఎప్పటికీ తగ్గేది కాదని చెప్పక తప్పదు.