రేవంత్ రెడ్డి నోరు విప్పితే చాలు అబద్ధాలే తాండవిస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడిపండు చూడు మేలిమై ఉండును.. పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా ఉంది. ఆయన మాట్లాడితే చాలు అబద్ధాలు తప్ప ఇంకేమీ ఉండడం లేదని తెలియజేశారు. ఆయన మాటలు వింటే అబద్ధాలే ఆత్మహత్య చేసుకుంటాయని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టిందని చెప్పడం దారుణం అన్నారు. ఆయన జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడని ఎక్కడ రిబ్బన్ కనిపిస్తే అక్కడ కత్తిరిస్తున్నాడని తెలియజేశాడు. రేవంత్ రెడ్డి తాజాగా ప్రారంభించినటువంటి ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో నిర్మించినవేనని, కేసీఆర్ భవిష్యత్తు తరాలను ఆలోచించి ఎన్నో పనులు చేశారని, నీలాగా దిక్కుమాలిన దివాలా రాజకీయాలకు పాల్పడలేదన్నారు. 

కోట్ల రూపాయలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి 20టీఎంసీల నీళ్లు నింపామని అన్నారు. అసలు రేవంత్ రెడ్డికి టీఎంసీలు అంటే తెలియవు ప్రాజెక్టుల నిర్మాణం అవగాహన లేదన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు 20టీఎంసీలే అని ఇందులో 12 టీఎంసీలు 1,65,000 ఎకరాలకు వెళ్తాయని, అలాగే ఎన్టిపిసి విద్యుత్ ఉత్పత్తి కోసం ఆరున్నర టీఎంసీలు, మంచిర్యాల గూడెం లిఫ్ట్ కు మూడు టిఎంసిలు,రామగుండం లిఫ్ట్  కు ఒక టీఎంసీ  వెళ్తోందని సూచించారు. ఇలా ఎల్లంపల్లి కెపాసిటీకి మించి 20 టీఎంసీలు హైదరాబాద్ కి ఎలా ఇస్తారు రేవంత్ రెడ్డి ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారని అన్నారు. ఇలా గోబెల్స్ ప్రచారం చేసుకొని ముఖ్యమంత్రి సీటుకు ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నావని మండిపడ్డారు. అసలు తెలంగాణలో  ఉన్న ప్రాజెక్టులకు కాళేశ్వరం ద్వారానే నీళ్లు వస్తున్నాయని సూచించారు.

కేసీఆర్ ముందు చూపుతోనే హైదరాబాద్ కు మంచినీటి  సౌకర్యం కోసం మల్లన్న సాగర్ లో స్లూయిస్ కూడా నిర్మించి పెట్టాడని, గండిపేట దగ్గర కొబ్బరికాయ కొట్టావు అంటే హైదరాబాదుకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వచ్చి చేరుతాయని తెలియజేశారు. ఇంత అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి అబద్దాలని నిజాలుగా ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. కేసీఆర్ సాధించిన విజయాలను నువ్వు ఎంత దాచినా దాగవని హరీష్ రావు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇలా ఒక్కటేమిటి రాష్ట్ర బాగు కోసం కేసీఆర్ ఎన్నో చేశారని వాటన్నింటిని మీరు వెళ్లి రిబ్బన్ కట్ చేసి మేమే చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారని రాబోవు రోజుల్లో మీకు పుట్టగతులు ఉండవంటూ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: