ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అమరావతి రాజధాని వివాదం తెరపైకి వచ్చింది. ప్రత్యేకించి ప్రతిపక్షం వైసీపీ లో ఈ అంశం చుట్టూ చర్చలు, విమర్శలు మళ్లీ రగులుతున్నాయి. ప్రజలకు అమరావతి ఒక సెంటిమెంట్‌గా మారిందన్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల సిద్ధాంతం కారణంగానే పార్టీకి భారీగా నష్టం వాటిల్లిందన్న అభిప్రాయం వైసీపీ లోపల బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీ కీలక నేత, రాష్ట్ర రాజకీయ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. . అధికారంలోకి తిరిగి వచ్చినా అమరావతినే కొనసాగించే ఆలోచనలో ఉన్నామని ఆయన చెప్పడం, పెద్ద నగరాన్ని నిర్మించడానికి మాత్రమే తాము వ్యతిరేకమని స్పష్టంచేయడం వలన వైసీపీ వైఖరి మారిందా? అన్న చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలను పలువురు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కోరోజు ఒక్కో విధానం ప్రకటించడం పార్టీకి మరింత నష్టం చేస్తుందని వారు బహిరంగంగానే చెబుతున్నారు.


మాజీ సీఎం జగన్ కూడా సజ్జల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. “మీ పాటికి మీరు నిర్ణయాలు తీసుకుని బయట ప్రకటిస్తే మేమెట్లు సమర్థించగలం?” అన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో కొన్ని కీలక నేతల ద్వారా వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఒక బ్రాండ్ అని, ఇప్పుడది ఎటు దారి తీస్తుందో స్పష్టత లేకపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందని వారు అంటున్నారు. వాస్తవానికి జగన్ అమరావతికి పూర్తిగా వ్యతిరేకం కాదు. కానీ విస్తృత స్థాయిలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికకే ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే మూడు రాజధానుల ఆలోచనను ముందుకు తెచ్చారు. అయితే ఈ అంశాన్ని ప్రజల్లోకి సరిగా తీసుకువెళ్లడంలో పార్టీ విఫలమైంది. ఇప్పుడు యూటర్న్ తీసుకుని అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పడం వల్ల రాజకీయంగా వైసీపీ కష్టాల్లో పడినట్టే అనుకోవాలి.


మొత్తం మీద, అమరావతి రాజధాని విషయంలో వైసీపీ లోపల ఒక్కో నేత ఒక్కో రీతిగా వ్యాఖ్యలు చేయడం, వాటిని సమర్థించలేకపోవడం, అంతర్గత అసంతృప్తి పెరుగుతుండటం పార్టీకి మరింత సవాల్‌గా మారింది. మ‌రి దీని నుంచి జ‌గ‌న్ ఎలా త‌ట్టుకుంటారో ?  ఏ స్టాండ్‌తో ముందుకు వెళ‌తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: