దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఎప్పుడూ వాణిజ్యానికి, వ్యాపారాలకు అగ్రగామిగా నిలుస్తుంటే.. ఇప్పుడు మరో విభాగంలోనూ అగ్రస్థానం సాధించింది. కానీ ఈసారి అది గర్వించదగిన విషయం కాదు, ఆర్థిక నేరాల్లో ముంబయి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2023లో ముంబయి నగరంలో 6,476 ఆర్థిక నేరాల కేసులు నమోదయ్యాయి. 2022లో 6,960 కేసులు ఉండగా, కొంత తగ్గినా.. ముంబయి మాత్రం టాప్‌లోనే నిలిచింది. ఇక హైదరాబాద్ కూడా ఆర్థిక నేరాల పరంగా ముంబయి వెంటే రెండో స్థానంలోకి వచ్చేసింది. 5,728 కేసులు నమోదవడం నిజంగా ఆందోళన కలిగించే అంశమే. టెక్నాలజీ సిటీగా, ఐటీ హబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ .. ఆర్థిక నేరాలు, సైబర్ మోసాల విషయంలో కూడా క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం. జైపూర్ 5,304 కేసులతో మూడో స్థానంలో ఉండగా, ఈ మెట్రో నగరాలన్నీ ఇప్పుడు నేరాల పెరుగుదలతో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

2023లో దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాల పరంగా రాజస్థాన్ 27,675 కేసులతో మొదటి స్థానం దక్కించుకుంది. తెలంగాణ 26,321 కేసులతో రెండో స్థానంలో ఉండగా, మహారాష్ట్ర 19,803 కేసులతో మూడో స్థానంలో నిలిచింది. ప్రత్యేకంగా మహారాష్ట్రలో వరుసగా ఈ నేరాలు పెరుగుతున్నాయి. 2021లో 15,550 కేసులు ఉండగా, 2023 నాటికి దాదాపు 20 వేలకి చేరాయి. ఆర్థిక నేరాలతో పాటు సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. కర్ణాటక 21,889 కేసులతో దేశంలో సైబర్ క్రైమ్‌లో మొదటి స్థానంలో ఉంది. మెట్రో నగరాల్లో బెంగళూరు 17,631 కేసులతో టాప్‌లో ఉండగా, హైదరాబాద్ 4,855 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. ముంబయి 4,131 కేసులతో మూడో స్థానంలో ఉంది. అంటే ఆర్థిక, సైబర్ నేరాల్లోనూ హైదరాబాద్ ప్రాధాన్యం పెరగడం భయపెట్టే పరిస్థితి.

హైదరాబాద్ ఐటీ రంగంలో, స్టార్టప్‌లలో ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో.. ఈ విధంగా ఆర్థిక, సైబర్ నేరాల జాబితాలో ముందు వరుసలో నిలవడం మంచిది కాదు. నిపుణులు చెబుతున్నట్లుగా, డిజిటల్ లావాదేవీల పెరుగుదల, ఆన్‌లైన్ ట్రేడింగ్, ఫేక్ కాల్స్, ఫ్రాడ్ లింకులు, పెట్టుబడుల పేరుతో మోసాలు వంటి అంశాలే ఈ కేసుల పెరుగుదలకు ప్రధాన కారణాలు. ఇకపై ప్రభుత్వ, పోలీసులు, టెక్ కంపెనీలు కలిసి ఈ నేరాలను అరికట్టే వ్యూహాలు రూపొందించకపోతే.. పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశముంది. హైదరాబాద్ రెండో స్థానంలో నిలవడం గర్వించదగిన విషయం కాదు.. గంభీరంగా తీసుకోవాల్సిన హెచ్చరిక.

మరింత సమాచారం తెలుసుకోండి: