
కానీ, ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. ఉద్యోగ సంఘాలు, స్థానిక నాయకులు చేసిన వ్యతిరేకత ఉన్నప్పటికీ వైసీపీ హయాంలోనే కేంద్రం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసింది. ప్రభుత్వం మాత్రం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత ఈ అంశంపై పార్టీ పూర్తిగా మౌనం పాటించింది. ప్రజలలో ఆ మౌనం ప్రతికూల అభిప్రాయాన్ని పెంచింది. ఇక జిల్లాల వారీగా చూస్తే.. విశాఖపట్నంలో వైసీపీ నాయకుల చురుకుదనం పూర్తిగా కనిపించట్లేదు. ఒకప్పుడు గళమెత్తిన నేతలు కూడా ఇప్పుడు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. తమపై ఉన్న కేసులైనా, వ్యాపార ప్రయోజనాలైనా - ఏదో ఒక కారణంతో మౌనం పాటిస్తున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి తొలగింపుల తర్వాత కన్నబాబుకు బాధ్యతలు అప్పగించినా ఇప్పటివరకు ఆయన పెద్దగా జిల్లాల పైన ఫోకస్ చేయలేదు. ఈ గ్యాప్‌ని ప్రత్యర్థి పార్టీలు బాగా వాడుకుంటున్నాయి.
టిడిపి ఉత్తరాంధ్రలో మళ్లీ పుంజుకుంటోంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆ పార్టీ నేతల దూకుడు గణనీయంగా పెరిగింది. విశాఖలో జనసేన, బీజేపీ నేతలు కూడా వేగంగా మైదానంలోకి దిగారు. ప్రజల మధ్య విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ వైసీపీ తరఫున మాత్రం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తప్ప ఇతర పెద్ద నాయకులు ఎవరూ సీన్‌లో లేరు. ఆయన మాటలను కూడా ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాంతాన్ని ఎవరు ఆక్రమిస్తారో వారు రాబోయే రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తారు. కానీ వైసీపీ ప్రస్తుతం చూపిస్తున్న నిర్లక్ష్యం, చురుకుదనం లోపం, ప్రజా సమస్యలపై స్పందించకపోవడం —ఇలా అన్నీ కలిసి పార్టీకి పెద్ద మైనస్‌గా మారుతున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగితే ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి మరింత క్లిష్టం కావడం ఖాయం!