ప్రధానమంత్రి నరేంద్రమోడితో జగన్మోహన్ రెడ్డి భేటి అయిపోయింది. దాదాపు 50 నిముషాల పాటు జరిగిన సమావేశంలో ఏ ఏ విషయాలు చర్చించారు, ప్రత్యేకమైన ఎజెండా ఏమన్నా ఉందా అన్న విషయాలు మూడో మనిషికి తెలిసే అవకాశం లేదు.  సమావేశంలో పాల్గొన్న ఇద్దరికి, చర్చించుకున్న ప్రధాని, జగన్ మధ్య మాత్రమే ఉంటాయి. అయితే ఓ నాలుగు రోజుల తర్వాత జగన్ తన ఎంపిలతో ఏమైనా విషయాలు పంచుకుంటే  అప్పుడు మాత్రమే కొన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.  ఎవరు ప్రధానమంత్రి అయినా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మామూలుగా జరిగేదిదే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా కాదని భేటి జరగ్గానే విశ్వసనీయవర్గాలు తెలిపాయని, సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఇవే అంటూ మీడియా ఊదరగొట్టిందంటే కచ్చితంగా అది ఊహాగానాలు, ఓవర్ యాక్షనే అనుకోవాలి.




ప్రధాని-జగన్ భేటిపై ఓ టీవీ చానల్ చేసిందిదే. వీళ్ళద్దరి భేటి మొదలుకాకముందు నుండే ఎన్డీఏలో వైసిపి చేరుతోందనే ప్రచారాన్ని మొదలుపెట్టేసింది. ఇదే సమయంలో ఎన్డీఏలో చేరితే ఉపయోగం ఏమిటి ? దూరంగా ఉంటే నష్టం ఏమిటి ? అంటూ చెప్పిన విషయాలనే తిప్పించి మళ్ళించి ఒకే విషయంపై గంటల పాటు సోది వండి వార్చేసింది.  భేటి ముగియగానే ఎన్డీఏలో చేరాల్సిందిగా జగన్ కు ప్రధానమంత్రి ఆఫర్ ఇచ్చారనే విషయం విశ్వసనీయంగా తెలిసిందంటూ నానా యాగీ చేసేసింది. మొదటే చెప్పుకున్నట్లుగా ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో చర్చించిన వివరాలు ఇంత తొందరగా బయటపడే అవకాశాలే లేవు. అయినా విశ్వసనీయవర్గాల ముసుగులో తాను చెప్పదలచుకున్న సోదంతా చెప్పేసింది.




ఇక జగన్ మీడియా సాక్షి అయితే భేటి జరిగిందని, సానుకూల వాతావరణంలో జరిగిందంటు చెప్పి ముగించేసింది. వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, నిధుల విడుదల, స్పెషల్ స్టేటస్ లాంటి అంశాలను జగన్ ప్రస్తావించారంటు చెప్పింది. అధికార మీడియా కదా నోటికొచ్చింది చెప్పేసే అవకాశాలు లేవు. ఇక ఎల్లోమీడయా విషయం చూస్తే ప్రధాని-జగన్ భేటి అశంపై దృష్టే పెట్టినట్లు లేదు. ఎందుకంటే అక్కడ భేటి జరుగుతున్నపుడు, భేటి ముగిసిన తర్వాత కూడా ఏదో ఓ అడ్వర్టైజ్మెంట్ తో సరిపెట్టేసుకుంది. ఎందుకంటే ఆమధ్య అమిత్ షా-జగన్ భేటి పై నోటికొచ్చిన పైత్యాన్నంతా గుప్పించేసింది.  జగన్ పై అమిత్ షా ఆగ్రహమని, తీవ్ర అసంతృప్తని నోటికొచ్చింది చెప్పేసి ఓ నలుగురితో చెప్పించేసింది. అయితే అదంతా తప్పని కేవలం కల్పితమని  తర్వాత తేలిపోవటంతో పరువంతా పోయింది.




ఎలాగూ వీళ్ళ భేటిపై పెద్దగా ఆసక్తి కూడా ఉన్నట్లు లేదు. ఎందుకంటే వీళ్ళ భేటిలో ఏదన్నా ఒప్పందాలు జరిగి అమల్లోకి వస్తే అది చంద్రబాబునాయుడు+ఎల్లోబ్యాచ్ మొత్తానికి మూడినట్లే. ఇందులో ఎల్లోమీడియా కూడా ఉంటుంది. కాబట్టే ప్రదాని-జగన్ భేటి పై పెద్దగా ఆసక్తి చూపినట్లు లేదు. మోడి-జగన్ కలవటం ఎల్లోమీడియాకు ఇష్టం లేదన్న విషయం కూడా బయటపడిపోయింది. ఇక్కడ  గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రధాని-జగన్ భేటి విషయంలో ఏమి జరిగిందో ఎవరికీ తెలియకపోయినా ఎవరి బుర్రకు తోచిన కథలను వాళ్ళు అల్లేసుకున్నారు. అంటే భేటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఇవ్వకుండా ఎవరికి వాళ్ళు తమ ఎంజెడాను అమలు చేసేశారు. ఇలా చేస్తేనే జనాల నమ్మకాన్ని మీడియా కోల్పోయేది.

మరింత సమాచారం తెలుసుకోండి: