తెలంగాణా కేసీయార్ ఢిల్లీలో ప్రధానమంత్రితో పాటు అనేకమంది కేంద్రమంత్రులను కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రధానితోను కేంద్రమంత్రులతోను ఏ ముఖ్యమంత్రి కలిసినా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలు, పెండింగ్ లో ఉన్న వ్యవహారాలు సహజంగానే అజెండాగ ఉంటాయి. వీటితో పాటు అవసరమైన మేరకు రాజకీయ చర్చలు ఎటూ ఉండనే ఉంటాయని కొత్తగా చెప్పక్కర్లేదు. తాజాగా కేసీయార్ ఢిల్లీ టూరులో కూడా ఇవన్నీ అనివార్యంగానే ఉన్నాయి. కేంద్రమంత్రుల భేటీలను పక్కన పెట్టేసినా ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటీపైనా సర్వత్రా ఆసక్తి రేపింది. ఎందుకంటే దుబ్బాక ఉపఎన్ని, గ్రేటర్ ఎన్నికల సమయంలో కేంద్రప్రభుత్వంపై కేసీయార్ ఎన్నిసార్లు నోరు పారేసుకున్నారో అందరికీ తెలిసిందే. కేంద్రం గొప్పేమిటి ? అంటూ తీసిపారేశారు. కేంద్రానికి, ఎన్డీయే ప్రభుత్వానికి ఎన్నోసార్లు, ఎన్నో విషయాల్లో సవాళ్ళు విసిరారు. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయితే ఎవరి గొప్పన్నట్లుగా డైలాగులు రువ్వారు. డిసెంబర్ మొదటివారంలో ఎన్డీయేతర పార్టీలన్నింటినీ హైదరాబాద్ కు పిలిపించి సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
సీన్ కట్ చేస్తే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోల్తాపడింది. పైగా దుబ్బాకలో బీజేపీ గెలవటమే కాకుండా గ్రేటర్ ఎన్నికల్లో 48 డివిజన్లలో గెలిచి ఊహించని విజయం అందుకుంది. దాంతో కేసీయార్ నోరు మళ్ళీ లేవలేదు. అసలు కేంద్రం గురించి, మోడి గురించి నోరు పెగలలేదు. ఎన్డీయేతర పార్టీల సమావేశం ఊసేలేదు. హఠాత్తుగా మూడు రోజుల టూరు పేరుతో ఢిల్లీలో వాలిపోయారు. తన పర్యటనలో మోడితో 40 నిముషాలు భేటీ అయ్యారు. వాళ్ళమధ్య ఏమి చర్చలు జరిగాయో ఎవరికీ తెలీదు. అయితే వీళ్ళ భేటి జరిగిన విధానంపై మాత్రం ఓ ఫొటో వైరల్ అయ్యింది.
కేసీయార్ ను మోడి ఆమడ దూరంలో కూర్చోబెట్టి మాట్లాడిన ఫొటో సోషల్ మీడియాలో జోరుగా తిరుగుతోంది. కేసీయార్ కు ఇచ్చే విలువేంటో దూరంగా సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడటంలోనే మోడి చెప్పేశారంటూ కామెంట్లు కూడా తిరుగుతున్నాయి. పనిలో పనిగా ఈమధ్యనే భేటి అయిన జగన్ను పక్కనే కూర్చోబెట్టుకుని మోడి మాట్లాడిన ఫొటో కూడా సోషల్ మీడియాలో తిరుగుతోంది. మరి ఫొటోలో కనిపించేదాన్ని బట్టి ప్రాధాన్యతలను నిర్ణయించేయవచ్చా అంటే ఎవరు సమాధానం చెప్పలేరు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం ఇపుడీ ఫొటోలు వైరల్ అవుతున్నది వాస్తవం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి