
రామన్ విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపుమరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎంఎస్సీ (ఫిజిక్స్)లో యూనివర్సిటీలో ప్రథమ స్థానంలో నిలిచారు.
భారతదేశంలోనేగాక ఆసియా ఖండంలోనూ నోబెల్ అందుకున్న మొదటి శాస్త్రవేత్త సర్.సి.వి రామన్. భౌతిక శాస్త్రంలో ‘రామన్ ఎఫెక్ట్’కుగానూ ఆయనకు 1930లో నోబెల్ బహుమతి లభించింది. అనంతరం 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. రామన్ పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది.
కార్యసాధకులకు హంగులు ఆర్భాటాలు అనవసరం. నోబెల్ బహుమతి కొరకు నేను సాగించిన ప్రయోగానికి నా పెట్టుబడి కేవలం రెండువందల రూపాయలే!" అన్నారాయన. జాతీయ పరిశోధనాలయాలపై అనవసరంగా విపరీతమైన ధనాన్ని వ్యయపరచడం రామన్ గారికి సరిపడేది కాదు. అందువల్లనే "షాజహాన్ తన ప్రియురాలి శవాన్ని ఖననం చేసేందుకు తాజ్ మహల్ నిర్మించాడు. జాతీయ ప్రయోగశాలలు శాస్త్ర పరిశోధనా పరికరాలను నిక్షేపం చేసేందుకు నిర్మించారు" అన్నారాయన. రామన్ ఎంత గొప్ప శాస్త్రజ్ఞుడో అంత గొప్ప వక్త. అతి క్లిష్టమైన శాస్త్రీయ విషయాలను జనరంజకంగా ఉపన్యసించగల మహామేధావి. మానవతావాది డా.రామన్. శాస్త్రవేత్తల పరిశోధనలు ప్రపంచ ప్రజల క్షేమానికి వినియోగ పడాలని చాటిచెప్పిన మహనీయుడు సర్.సి.వి.రామన్. జీవితమంతా శాస్త్ర పరిశోధనలో గడిపి, భారతదేశ కీర్తి పతాకను రెపరెపలాడించిన సర్. సి.వి.రామన్ తన 83వ ఏట 1970 నవంబర్ 21 వ తేదీన దివంగతుడయ్యాడు.