
ముచ్చింతల్ సమతామూర్తి, 108 దివ్యక్షేత్రాల సందర్శనకు భక్తులకు అనుమతి ఇస్తున్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 వరకు దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉచితంగానే దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే.. ఈ ఉచిత దర్శనం కేవలం ఈనెల 19 వరకే ఉంటుంది. ఆ తర్వాత కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎంత అనేది ఇంకా ప్రకటించలేదు. ఈ టికెట్ ధరలను త్వరలో నిర్వహణ కమిటీ ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది.
ఈ సమతామూర్తి దర్శనం ధరలు పెద్దలకు రూ.100.. పిల్లలకు రూ. 50గా ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం ఉచిత దర్శనానికి అనుమతిస్తున్న భక్తులకు ప్రస్తుతానికి స్వర్ణమూర్తి దర్శనానికి మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. అంతే కాదు.. సాంకేతిక కారణాలతో త్రీడీ మ్యాపింగ్ షో కూడా తాత్కాలికంగా నిలిపేశారు.
స్వర్ణమూర్తి దర్శనంతో పాటు త్రీడీ లేజర్ షోను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులకు ఈనెల 19 వరకు సమతామూర్తి ఉచిత దర్శనం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ సమతామూర్తి విగ్రహం కూర్చున్న విగ్రహాల్లో దేశంలోనే అతి పెద్దది కావడం విశేషం.. ఇటీవల ఈ విగ్రహం ప్రారంంభానికి ప్రధాని, రాష్ట్రపతి వంటి ప్రముకులు విచ్చేశారు. దేశం నలుమూలల నుంచి స్వామీజీలు విచ్చేసి.. ఈ విగ్రహం ప్రతిష్టాపనను కొనియాడారు. దీంతో ఇప్పుడు హైదరాబాద్ వచ్చే పర్యాటకులకు ఈ సమతా మూర్తి విగ్రహం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.