తెలుగింటి స్త్రీలు ఎంతో శ్రద్ధగా జరుపుకునే పవిత్ర పండుగల్లో అట్లతద్ది ఒకటి. ఆశ్వయుజ మాసం బహుళ కృష్ణ పక్షంలోని తదియ తిథినాడు ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో భక్తి భావంతో ఆచరిస్తారు. ఈ ఏడాది అట్లతద్ది అక్టోబర్ 9న జరగనుంది. ఆ రోజు స్త్రీలు ఉపవాసం ఉండి గౌరీ దేవిని, చంద్రుడిని పూజించి కుటుంబ సుఖశాంతులు, భర్త దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తారు. పెళ్లి కాని యువతులు మంచి జీవిత భాగస్వామి కోసం వ్రతం చేస్తారు. ఈ రోజు తెల్లవారుజామునే స్నానం చేసి చుక్క ఉన్న సమయంలో అన్నం తింటారు. బెండకాయ చింతకాయ కూర, గోంగూర పచ్చడి, పొట్లకాయ పాల కూర, ముద్దపప్పు, పెరుగుతో భోజనం చేస్తారు. ఆ తర్వాత చంద్రోదయం అయ్యేవరకు ఉపవాసం ఉంటారు.
 

ఆ రోజున మహిళలు గోరింటాకు పెట్టుకుని ఊయల ఊగుతూ పాటలు పాడుకుంటూ పండుగ ఉత్సాహాన్ని పంచుకుంటారు. “అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్…” అంటూ ఆటపాటలతో వాతావరణాన్ని ముచ్చటగా మార్చేస్తారు. పూజా విధానంలో గౌరీ దేవికి ఇష్టమైన అట్లు, కుడుములు, పులిహోర, పాలతాలికలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. 11 మంది ముత్తయిదువులను ఆహ్వానించి పూజల్లో పాల్గొనిస్తారు. చేతులకు చామంతి, తులసి, తమలపాకులతో తోరణాలు కట్టి పసుపుతో గణపతి, గౌరీ దేవిని ఆవాహన చేస్తారు. తర్వాత లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తర శతనామ పాఠాలు చదివి అట్లతద్ది వ్రతకథ వినిపిస్తారు. అట్లతద్దె కథలో సునామ అనే రాజకుమార్తె చంద్రోదయానికి ముందే ఎంగిలిపడి నోము ఉల్లంఘించింది. దీంతో మంచి భర్త రాలేదు.

 

ఇక తర్వాత పార్వతీ పరమేశ్వరుల సూచనతో నిబంధనల ప్రకారం వ్రతం పూర్తి చేయడంతో అందగాడు భర్త దొరికాడు. ఈ కథ ద్వారా వ్రతం యొక్క ఆధ్యాత్మికతను స్త్రీలు గుర్తుంచుకుంటారు. వాయనం ఇచ్చే, పుచ్చుకునే సమయంలో “ఇస్తినమ్మ వాయనం” – “పుచ్చుకుంటినమ్మ వాయనం” అంటూ సంప్రదాయంగా మాటలు పలుకుతారు. వాయనంలో అట్లు, తాంబూలం, జాకెట్‌ బట్ట లేదా చీర ఉంటాయి. ఈ ఆచారం స్త్రీల మధ్య ఆప్యాయత, పంచుకునే సౌభ్రాత్రాన్ని చాటుతుంది. అట్లతద్ది రోజున భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తే కుటుంబంలో శాంతి, సుఖసంపదలు, భర్తకు దీర్ఘాయుష్షు లభిస్తాయని నమ్మకం. యువతులకు మంచి భర్త దొరుకుతాడనే విశ్వాసం ఉంది. ఈ పండుగ కేవలం ఆచారం మాత్రమే కాదు — స్త్రీల మధ్య బంధాలను బలపరిచే పండుగ కూడా.



నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. ఇండియా హెరాల్డ్ దీనిని ధృవీకరించలేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: