ప్లాస్టిక్..ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య ఇది. మన సౌకర్యం కోసం కనిపెట్టిన ప్లాస్టిక్ ఇప్పుడు మనల్నే మింగేసే పరిస్థితికి చేరింది. త్వరలోనే భూమండలమంతా ప్లాస్టిక్ చెత్తతో నిండే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్లాస్టిక్ త్వరగా భూమిలో కలవదు. కొన్ని వందల ఏళ్లు పడుతుంది అది మట్టి కావాలంటే. ఒక ప్లాస్టిక్‌ ఫోర్క్‌ నేలలో కలసిపోవడానికి 450 ఏళ్లు పడుతుంది.


ఈ సమయంలో ప్లాస్టిక్ ను తినే బ్యాక్టీరియాను డెవలప్ చేశారు మన ఇండియన్ సైంటిస్టులు. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలను 2022 నాటికి పూర్తిగా నిర్మూలించాలన్న ప్రధాని మోదీ పిలుపు నేపథ్యంలో ఈ ఆవిష్కారానికి ప్రాధాన్యం సంతరించుకుంది. యూపీలోని గ్రేటర్‌ నోయిడాలో ఉన్న శివ్‌నాడర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ బ్యాక్టీరియాను కనుగొన్నారు.


వర్సిటీ పక్కనే ఉన్న చిత్తడి నేలల్లో ఈ సూక్ష్మజీవులు వెలుగు చూశాయి. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ లోని కీలక పదార్థమైన పాలిస్టిరీన్‌ను క్షీణింపచేసి, సురక్షితంగా నేలలో కలిపేసే సామర్థ్యం వీటికి ఉంది. వీటిని ఎక్సిగువోబ్యాక్టీరియం సిబిరీషియం డీఆర్‌11, ఎక్సిగువోబ్యాక్టీరియం అండే డీఆర్‌14గా గుర్తించారు.


భారత్‌లో ఏటా 16.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వినియోగమవుతున్నట్లు అంచనా. కొత్తగా కనుగొన్న రెండు రకాల బ్యాక్టీరియా పాలిస్టిరీన్‌ ఉపరితలాలపై జీవపొరలను ఏర్పరుస్తాయి. అనంతరం వాటిని క్షీణింపజేస్తాయి. దీంతో మానవాళికి గొప్ప మేలు చేకూరినట్టేనని భావిస్తున్నారు. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: