ప్రపంచంలో చాలా దేశాల్లో కనిపించకుండానే మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారు. ప్రముఖ కంపెనీల్లో కూడా వీరికి ఉద్యోగాలు పురుషులతో సమానంగా ఉండటం అరుదు. అలాగే వేతనాల్లో కూడా తేడా ఉంటుంది. మహిళలు మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగాలు చేస్తున్న కంపెనీలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఇలాంటి సమయంలో లింగ సమానత్వం దిశగా జర్మనీ దేశం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోని కంపెనీల్లో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలకు కోటా ఉండేలా చట్టం చేసింది.

దేశంలోని లిస్టెడ్ కంపెనీలన్నీ సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలకు తప్పనిసరిగా కోటా ఇవ్వాలని స్పష్టం చేసింది. జర్మనీలో ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నేతృత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాట్స్, సోషల్ డెమొక్రాట్స్ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఈ ప్రభుత్వం శుక్రవారం నాడు ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కనీసం మేనేజ్‌మెంట్ బోర్డులో ముగ్గురు వ్యక్తులున్న కంపెనీలు కనీసం ఓ మహిళకు అవకాశం ఇవ్వాలని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న వాలంటరీ సిస్టం లింగ సమానత్వంలో ఘోరంగా విఫలమైందని విమర్శలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే జర్మనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం చేయడంపై జర్మనీ మహిళా శాఖ మంత్రి ఫ్రాంజిస్కా జిఫ్పీ స్పందించారు. ‘‘ఇదో చరిత్రాత్మక నిర్ణయం. మహిళలు లేని బోర్డు రూమ్స్‌కు మేం పుల్‌స్టాప్ పెడుతున్నాం. భవిష్యత్తులో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ఉండే ఆధునిక సమాజానికి ఈ నిర్ణయం బాటలు వేస్తోంది. అన్ని పనులూ వాలంటరీగా జరగవు. కొన్నిసార్లు మార్గదర్శకాలు తప్పనిసరి’’ అని ఆమె పేర్కొన్నారు.

చాలా కంపెనీల్లో బోర్డు మెంబర్స్‌గా ఎక్కువగా మగవారే ఉంటున్నారు. మహిళలకు ఈ అవకాశం రావడం చాలా అరుదు. జర్మనీలోని 30 అతిపెద్ద కంపెనీల మేనేజ్‌మెంట్ బోర్డుల్లో మహిళలు కేవలం 12.8శాతం మంది మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్య అమెరికాలో 28.6 శాతం, ఇంగ్లండ్‌లో 24.5శాతం, ఫ్రాన్స్‌లో 22.2శాతం ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: