
లాక్డౌన్ కారణంగా జనమంతా ఇళ్లకే పరిమితం కావడం.. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో వాతావరణంలో మంచిమార్పులు చోటుచేసుకుంటున్నాయి. గాలిలో కాలుష్యశాతం దాదాపుగా తగ్గిపోయింది. గాలి నాణ్యత పెరిగింది. మురికికూపంగా మారిన అనేక నదులు ఇప్పుడు మెరిసిపోతున్నాయి. నీరు తేరుకుంటోంది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ ఊడా ఊపిరిపీల్చుకుంటోంది. ఈ సరస్సులోని నీటి నాణ్యత పెరిగింది. దాదాపు ఈ సరస్సు చుట్టూ ఉన్న దాదాపు తొమ్మిది లొకేషన్లలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రతీ నెల పరీక్షలు చేస్తారు. ఆ ప్రాంతాల్లోని నీటిని పరీక్షిస్తారు. అయితే.. లాక్డౌన్ కారణంగా హుస్సేన్‌సాగర్‌లోని నీటి నాణ్యత పెరిగిందని అధికారులు వెల్లడించారు.
నీటిలో ఆక్సిజన్ శాతం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇది చాలా మంచి పరిణామం అని చెబుతున్నారు. జన సందర్శన నిలిచిపోవడంతో.. వ్యర్థాలు కూడా పూర్తిస్థాయిలో తగ్గిపోయినట్లు పీసీబీ అధికారులు వెల్లడించారు. నీటిలో హానికారక లవణాలు తగ్గిపోయాయని అంటున్నారు. మానవ కార్యకలాపాలు నిలిచిపోవడం, సరస్సు చుట్టూ బోటింగ్, వినోదం, తినుబండారాలు వంటి కార్యకలాపాలు లేకపోవడం వల్ల ఈ సానుకూల ఫలితాలు వచ్చాయని చెప్పొచ్చు. పీసీబీ అధికారులు బోట్ క్లబ్ వద్ద అవుట్లెట్, వైస్రాయ్ హోటల్ వద్ద అవుట్లెట్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా, ట్యాంక్ బండ్‌పై లేపాక్షి హస్తకళల ప్రాంతం, సంజీవయ్య పార్క్, సెయిలింగ్ క్లబ్, బ్రిడ్జ్- I వద్ద నీటిని పరీక్షించారు.