
ప్రధానమంత్రి నరేంద్రమోడిలో ఉత్తరప్రదేశ్ టెన్షన్ పెరిగిపోతున్నట్లే ఉంది. దీనికి కారణం ఏమిటంటే వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటమే. పోయిన ఎన్నికల్లో దాదాపు 320 సీట్లు తెచ్చుకని బీజేపీ అఖండవిజయం సాధించింది. అయితే అప్పట్లో పార్టీకి ఉన్న క్రేజు, సానుకూలతలు ఇపుడు తగ్గిపోయాయి. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే వాతావరణం పూర్తి నెగిటివ్ అయిపోయింది. ఆదిత్యనాధ్ సిఎం అయిన కొత్తల్లో కాస్త పర్వాలేదు కానీ తర్వాత నుండి ఏదోక ఆరోపణ, విమర్శ వస్తునే ఉంది. అయితే కేంద్రం+రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉండటంతో ఆదిత్యనాద్ ను ఎవరు పట్టించుకోలేదు. పోయిన లోక్ సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ సాధించిన సీట్ల కారణంగానే ఢిల్లీ అధికారాన్ని బీజేపీ చాలా తేలిగ్గా అందుకోగలిగింది.
మళ్ళీ అలాంటి మ్యాజిక్కే రిపీట్ కావాలంటే ముందు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవాలి. కానీ ప్రస్తుత పరిస్దితులు అందుకు అనుకూలంగా లేవనే చెప్పాలి. ఈ టెన్షన్ కారణంగానే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హెసబళెతో మోడి కీలకభేటి జరిపారు. కేంద్రంలోని బీజేపీని అయినా వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలకైనా మూలం ఆర్ఎస్ఎస్సే అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సమస్య ఏమిటంటే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత కారణంగా దేశవ్యాప్తంగా మోడి ఇమేజి పూర్తిగా మసకబారిపోయింది. ఇదే సమయంలో యోగి ఆదిత్యనాద్ పైన కూడా జనాలు మండిపోతున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో దేశంలో మోడి ఫెయిలైనట్లే యూపీలో యోగి విఫలమయ్యారు. ఇందుకనే అలహాబాద్ హైకోర్టు మాట్లాడుతు కోవిడ్ బారినుండి యూపీని దేవుడే రక్షించాలనే తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
గంగానదిలో వందలాది మృతదేహాలు కొట్టుకుపోవటం, గంగానదీ తీరంలో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టడం లాంటి ఘటనలతో యూపీ ప్రభుత్వం పరువు సాంతం పోయింది. ఇలాంటి అనేక ఘటనల కారణంగా మోడి పనితీరుపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా బాగా అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం పెరిగిపోతోంది. దీనికితోడు మొన్ననే యూపిలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కమలంపార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. స్ధానికసంస్ధల ఎన్నికల రిజల్టు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిపీటవుతుందేమో అనే టెన్షన్ మొదలైపోయింది మోడిలో. ఒకవేళ అదే జరిగితే బీజేపీ చేతిలో నుండి అతిపెద్ద రాష్ట్రం జారిపోతుంది. దీని ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో పడితే కేంద్రంలో కూడా బీజేపీ ఓటమి ఖాయమనే టెన్షన్ కమలనాదుల్లో పెరిగిపోతోంది. మోడిపై వ్యతిరేకత మొన్నటి పశ్చిమబెంగాల్లో బయటపడిన విషయం అందరు చూసిందే. అందుకనే హొసబళేతో మోడి భేటీఅయ్యారు. మరి భేటి పర్యవసానాలు ఏమిటో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.