రాయలసీమ ఎత్తిపోతల పథకం.. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు ఇది. రాయలసీమకు ఎలాగైనా నీళ్లు తీసుకెళ్లాలని భావిస్తున్న జగన్‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదని తెలిసి కూడా ఈ పథకం చేపట్టారు.. రాయలసీమ ఎత్తిపోతల అంశంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. ఈ ప్రాజెక్టు విషయంలో రాజీ పడటం లేదు. మాకు కేటాయించిన నీళ్లే కదా మేం వాడుకుంటున్నాం.. అవి ఎలా తీసుకుంటే మీకేంటి అన్నది జగన్ వాదన.


రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు జగన్‌కు రాజకీయంగానూ చాలా కీలకమైందని చెప్పొచ్చు.. ఈ రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే.. సీమకు నీళ్లు తెచ్చిన నాయకుడిగా జగన్ పేరు మోగిపోతుంది. అది వైసీపీకి ప్లస్ అవుతుంది. అయితే రాయలసీమ ఎత్తిపోతల అంశంపై తెలంగాణ కూడా గట్టి పట్టుదలగానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును అడ్డుకుంటామంటోంది. ఈ నేపథ్యంలోనే పరస్పర ఫిర్యాదులతో విషయం కాస్తా జాతీయ హరిత ట్రైబ్యునల్ వద్దకూ.. కృష్ణా రివర్ బోర్డు వద్దకు వెళ్లింది.


కొన్నిరోజుల క్రితం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును కృష్ణా బోర్డు సందర్శించింది. అక్కడి పనులను పరిశీలించింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, సభ్యుడు మౌతాంగ్, కేంద్ర జలసంఘం సంచాలకులు దర్పన్ తల్వార్‌తో కూడిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ టీమ్.. ఇటీవల రాయల సీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించింది. పరిశీలన తర్వాత ఇప్పుడు బోర్డు ఓ నివేదిక తయారు చేసింది. దీన్ని  జాతీయ హరిత ట్రైబ్యునల్ కు సమర్పించాల్సి ఉంది. ఈ నివేదకను బట్టే  ఎన్జీటీ తీర్పు ఉంటుంది.


అయితే ఈ రిపోర్టులో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్ తయారీ అవసరానికి మించి ప్రాజెక్టు పనులు చేపట్టారని కృష్ణా బోర్డు బృందం అభిప్రాయపడినట్టు  తెలుస్తోంది. ఈ నివేదికలో ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలు, ఫోటోలు అటాచ్ చేశారట. అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, పంప్ హౌస్, డెలివరీ మెయిన్, లింక్ కెనాల్, బ్యాచింగ్ ప్లాంట్, నిర్మాణ సామగ్రి వివరాలన్నీ ఉన్నాయట. అయితే.. అక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని బోర్డు నివేదికలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగానే ఈ నెల 16న ఎన్జీటీ విచారణ జరిగే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: