తెలుగు వారి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక అన్న‌గారు నంద‌మూరి తార‌క‌రామారావు. రాజ‌కీయంగా.. సినీప‌రంగా ఆయ‌న ఈ తెలుగు నేల‌పైనే కాదు.. దేశంలోనే చిర‌కీర్తిని సొంతం చేసుకున్నారు. అయితే.. ఆయ‌న‌కు అనేక గౌర‌వాలు.. అవార్డులు.. రివార్డులు.. పద్మాలు ద‌క్కినా.. అంత‌కుమించి! అన్న‌ట్టుగా.. ఇప్పుడు అద్భుత‌మైన, చిర‌కాలం శాశ్వ‌తంగా ఉండిపోయే.. ప్ర‌తి ఒక్క‌రి నాలుక‌ల‌పై క‌ద‌లాడే.. గౌర‌వం (మ‌ర‌ణాంత‌రం) ద‌క్కింది. ఈ విష‌యంలో ఎవ‌రికీ.. సందేహం లేదు. ఎవ‌రూ కోర‌కుండానే.. ముఖ్యంగా నంద‌మూరి కుటుంబం నుంచి ఎలాంటి డిమాండ్ లేకుండానే.. కేవ‌లం ప్ర‌జ‌ల కోరిక‌మేర‌కు.. సీఎం వైఎస్ జ‌గ‌న్‌.. తాజాగా ప్ర‌క‌టించిన కొత్త జిల్లాల్లో విజ‌య‌వాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ప్ర‌క‌టించారు.

ఈ నిర్ణ‌యం ప‌ట్ల‌.. అన్ని వ‌ర్గాల నుంచి హ‌ర్షం వ్య‌క్త‌మైంది. ఒక్క వంగ‌వీటి కుటుంబం నుంచి త‌ప్ప‌. అయితే.. అత్యంత కీల‌క‌మై న‌.. నంద‌మూరి కుటుంబం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పేరుపై ఇద్ద‌రే ఇద్ద‌రు స్పందించారు. ఒక‌రు అన్న‌గారి కుమారుడు రామ కృష్ణ‌. ఆయ‌న ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్ట‌డంపై సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వానికి, ముఖ్య‌మంత్రికి కూడా ధ‌న్య‌వాదాలు చెప్పారు. ఇక‌, అన్న‌గారి కుమార్తె , కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వ‌రి కూడా రియాక్ట్ అయ్యారు. ఈ నిర్ణ‌యం ముదావ‌హ‌మ‌ని పేర్కొన్నారు. ఇక‌, టీడీపీ అధినేత‌, అన్న‌గారి అల్లుడు.. చంద్ర‌బాబు మాత్రం.. `పెడితే కాదంటామా?` అంటూ రివ‌ర్స్‌లో స్పందించారు.

ఇవ‌న్నీ ఒక ఎత్తు.. అయితే.. ఇప్పుడు నెటిజ‌న్ల మ‌ధ్య సాగుతున్న చ‌ర్చ మ‌రో ఎత్తు. అదేంటంటే.. అన్న‌గారి ముఖ‌క‌వ‌ళిక‌ల‌ను పుణికి పుచ్చుకుని.. న‌ట వార‌సుడిగా.. తెలుగు చిత్ర సీమ‌లో ఎర్ర‌చంద‌న‌పు చెట్టుగా ఎదుగుతున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించ‌లేదు. నిజానికి ఆయ‌న తెల్లారిలేస్తే.. తాత‌గారి ద‌ర్శ‌నంతోనే రోజు వారీ కార్య‌క్ర‌మాలు ప్రారంభిస్తార‌నే విష‌యం తెలిసిందే. ఎక్క‌డ ఉన్నా.. ఏం చేస్తున్నా.. ఎన్టీఆర్ పేరు త‌లుచుకుంటే.. ఆయ‌న‌కు ఒళ్లు పుల‌క‌రిస్తుంది. మ‌రి అలాంటి జూనియ‌ర్‌.. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపైనా.. విజ‌య‌వాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయ‌డంపైనా.. మాత్రం ఏమాత్రం స్పందించ‌లేదు. క‌నీసం.. ముక్త‌స‌రిగా కూడా ఒక్క మాట అన‌లేదు. ఏమీ తెలియ‌న‌ట్టే ఉన్నారు.

నిజానికి ఈ విష‌యం జూనియ‌ర్‌కు తెలియ‌దా?  లేక‌.. తెలిసినా.. వెనుక ఎవ‌రో.. ఉండి.. ఆయ‌న‌ను సైలెంట్ చేశారా? అనే సందేహాలు.. నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో అసెంబ్లీలో చంద్ర‌బాబు ఇష్యూ వ‌చ్చిన‌ప్పుడు.. ఆయ‌న స్పందించారు. అప్ప‌ట్లో ఆయ‌న స్పందించినా.. వివాదం రేగింది. ఇలాగేనా స్పందించేది అంటూ.. టీడీపీ నాయ‌కులే రోడ్డుకు లాగారు. ఇప్పుడు కూడా తెర‌వెనుకేదో జ‌రిగింద‌ని.. జూనియ‌ర్‌ను సైలెంట్ చేశార‌ని.. తాత‌గారి పేరు పెట్టిన నేప‌థ్యంలో స్పందించాల‌ని ఉన్నా.. ఆయ‌న స్పంద‌న వ‌ల్ల వైసీపీకి, ప్ర‌భుత్వానికి ఎక్క‌డ పేరు వ‌స్తుందోన‌ని భావించి.. `కీల‌క కుటుంబ స‌భ్యులే` జూనియ‌ర్‌ను అదుపు చేశార‌ని నెటిజ‌న్లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: