పయ్యావుల కేశవ్‌.. రాయలసీమలో గెలిచిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. పార్టీ తరపున వాయిస్ బాగా వినిపించగలిగిన నాయకుడు ఆయన. కాకపోతే.. ఆయనకు ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఆయన గెలిచిన ప్రతిసారి పార్టీ అధికారం కోల్పోతోంది. గత ఎన్నికల్లోనూ అదే జరిగింది. అయితే.. ఇటీవల ఆయన భద్రత విషయంలో కాస్త గందరగోళం జరిగింది. ఆయనకు చెప్పకుండానే గన్‌మెన్లను మార్చారని పయ్యావుల ఆరోపించారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి తన భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు.


భద్రత విషయంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తన భద్రత విషయంలోగందరగోళం ఉందని ఓ ఉన్నతాధికారే నా దృష్టికి తెచ్చారని.. నాపై అక్రమ కేసుకూ కుట్ర జరుగుతోందని ఆ అధికారి సమాచారం ఇచ్చారని.. నా నియోజకవర్గంలో గత 3నెలల నుంచి మాజీ మిలిటెంట్ల సంచారం పెరిగిందని.. స్థానికేతర మాజీ మిలిటెంట్లకు నా నియోజకవర్గంలో పనేంటి అని పయ్యావుల కేశవ్‌ అనుమానం వ్యక్తం చేశారు.


పోలీస్ ఇన్ఫార్మర్లుగా పని చేసిన మాజీ నక్సలైట్లు మా నియోజకవర్గంలో తిరుగుతున్నారన్న పయ్యావుల కేశవ్‌.. కీలక విషయాలను ప్రస్తావిస్తున్నానని నన్ను లక్ష్యంగా చేశారన్నారు. నాకు భద్రత కల్పించే విషయంలో విచిత్రమైన వాదనలు ప్రభుత్వం నుంచి ఉన్నాయన్న పయ్యావుల కేశవ్‌.. ఎవరికీ లేని విధంగా గన్‌మెన్లను రాష్ట్రానికే పరిమితం చేయాలనీ, సరిహద్దు దాటి తీసుకెళ్లవద్దనే నిబంధనలు పెట్టటమేంటని ప్రశ్నించారు. జీవో 655 నిబంధనలే నేతలందరికి వర్తింప చేస్తున్నారా అని ప్రశ్నించిన పయ్యావుల.. గన్ లైసెన్సుకు ఆల్ ఇండియా పర్మిట్ కావాలంటే నాలుగు నెలల నుంచి పెండింగులో పెట్టారని ఆరోపించారు.


నక్సలైట్లతో ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబం మాది అంటూ వివరించిన పయ్యావుల కేశవ్‌.. పోరాటాల్లో పుట్టి పెరిగిన వాడిని.. రాటు తేలిన వాడిని బెదిరింపులకు భయపడనని అన్నారు. సెక్యూరిటీ  పెంచాలని ఇంటెలెజిన్స్ చీఫ్ ను అడిగిన మర్నాడే నా గన్ మెన్లను మార్చారని పయ్యావుల కేశవ్‌ గుర్తు చేశారు. చంద్రబాబు దిల్లీ పర్యటన సందర్భంగా జాతీయ నాయకులు ఆయన్ని రిసీవ్ చేసుకున్న తీరులో స్పష్టమైన మార్పు కనిపించినందునే తాడేపల్లి లో ప్రకంపనలు మొదలయ్యాయని పయ్యావుల కేశవ్‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీకి ఉలుకెందుకని పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: