పాపం.. ఇటీవల తెలంగాణ హైకోర్టులో సీఎం కేసీఆర్‌కు అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ప్రత్యేకించి ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇటీవల చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. కోర్టు అనేక విషయంలో సర్కారు తీరును తప్పుబట్టింది కూడా. ఇక ఇప్పుడు మరో కేసు విషయంలోనూ కేసీఆర్‌కు ఇదే పరిస్థితి ఎదురైందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి సభ్యులను 13 నుంచి 5 తగ్గించడం చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వైద్య మండలి సభ్యులను తగ్గిస్తూ 2015లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.


తాత్కాలిక మండలి ఏర్పాటు కూడా చట్ట విరుద్ధమేనన్న ధర్మాసనం ఆ జీవోనూ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మూడు నెలల్లో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు ఎన్నికలు జరపాలని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు... అప్పటి వరకు తాత్కాలిక వైద్య మండలి కొనసాగవచ్చని తెలిపింది. వైద్య మండలి సభ్యుల కుదింపు, తాత్కాలిక మండలి ఏర్పాటుపై 2016లో హెల్త్‌కేర్ రిఫార్మ్స్‌ డాక్టర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం తీర్పు వెల్లడించింది.


రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఏపీలో అమల్లో ఉన్న చట్టాన్ని స్వీకరిస్తున్న సందర్భంలో సభ్యులను కుదించడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. అప్పటి వరకు అమల్లో ఉన్న చట్టాన్ని అన్వయించుకునే సమయంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చని కానీ కీలక సవరణ చేయడానికి వీల్లేదని తెలంగాణ హైకోర్టు తెలిపింది.


చట్టసవరణలు శాసనసభే చేయాలి కానీ.. జీవోల ద్వారా కుదరదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తాత్కాలిక మండలి ఏర్పాటు కూడా చట్టంలో ఎక్కడా లేదని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. కాబట్టి పూర్తిస్థాయి మెడికల్ కౌన్సిల్‌కు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే అప్పటి వరకు కార్యకలాపాలు కొనసాగాలి కాబట్టి... ఎన్నికలయ్యే వరకు తాత్కాలిక మండలి కొనసాగవచ్చని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr