తాజాగా జనసేన అదినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి.. `కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ` అని చాలా లైట్ తీసుకున్నారు జగన్. అంతేకాదు.. `సింగిల్ టైమ్ ఎమ్మెల్యే` అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ రెండు చాలా తేలికగానే జగన్ భావించి ఉంటారు. తన మనసులో మాటను ఓపెన్‌గానే చెప్పేస్తామని కూడా అనుకుని ఉంటారు. కానీ, ఈ రెండు అంశాలు కూడా.. చాలా సున్నితమైన విషయాలు కావడం.. పవన్ కల్యాణ్‌ను అభిమానించేవారికి.. ఇవి బాధించడం గమనార్హం. ఇప్పటికే.. గత ఎన్నికలకు ముందు.. నాలుగు పెళ్ళిళ్లు చేసుకున్నారంటూ..జగన్ చేసిన వ్యాఖ్యలతో కాపులు దూరమయ్యారు.
ఒకప్పుడు బలం ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపులు వైసీపీకి చేరువ అయ్యారు. అదే వైసీపీని 2019లో అధికా రంలోకి తీసుకువచ్చేందుకు మేలి మలుపు తిప్పేలా చేసింది. అయితే.. ఆ తర్వాత.. పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా కాకుండా.. వ్యక్తిగతం విమర్శించడం ప్రారంభించిన తర్వాత.. జగన్ ఇమేజ్‌కు భారీ డ్యామేజీ ఏర్పడడం ప్రారంభమైంది. ఇది ఎన్నికల సమయానికి బలమైన కాపు ఓట్లను చీల్చేసి.. గుండుగుత్తగా.. మనోణ్ణి అవమానిస్తున్నాడు అనే టాక్ వినిపించే పరిస్థితికి చేరుకుంది. ఆ తర్వాత.. కూడా కూటమి కట్టొద్దని, దమ్ముధైర్యం ఉంటే.. ఒంటరిగానే రావాలని చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీకి యాంటీ అయ్యాయి.
ఇలా.. పవన్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించినా.. అది కాపులకు, మెగా అభిమానులకూడా మంట పుట్టించిందన్నది వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించిన కొందరు వైసీపీ నాయకులు పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడాన్ని అంతర్గత బేటీల్లో తప్పుబట్టారు. అయినా.. జగన్ సహా కొందరు నాయకుల తీరు మారలేదు. ఫలితంగానే ఉమ్మడి గోదావరి జిల్లా కోస్తా జిల్లాల్లో కాపు వర్గం, మెగా అభిమాన వర్గం ఉన్న చోట్ల వైసీపీ కుదేలైంది. ఇక, అధికారం కోల్పోయిన తర్వాత.. కొన్నాళ్లుగా జగన్ పవన్ గురించి ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. కానీ.. ఇప్పుడు.. ఆ గ్యాప్‌ను పూర్తి చేస్తున్నట్టుగా.. పవన్‌పై కేవలం రెండే రెండు వ్యాఖ్యలు చేయడం.. ఇవి జనాల్లో జోరుగా వైరల్ కావడంతో కాపులు మళ్లీ రగిలిపోతున్నారన్నది వాస్తవం.