
2000 ఆగస్టు 28న "చలో అసెంబ్లీ" పిలుపుతో భారీ నిరసన జరిగింది. కానీ హైదరాబాదు బషీర్‌బాగ్ వద్ద పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో ప్రజా వ్యతిరేకత మరింత పెరిగింది. ఇదే సమయంలో టీడీపీలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ కూడా ఈ పెంపును వ్యతిరేకించారు. ఏపీలో వ్యవసాయం సాగు అంతా కాలువల ద్వారా జరుగుతుందని.. విద్యుత్ ఛార్జీల పెంపుతో తెలంగాణ రైతులపై భారం ఎక్కువైందని వాదిస్తూ ఆయన డిప్యూటీ స్పీకర్ పదవికి, పార్టీకి రాజీనామా చేసి 2001లో టీఆర్ఎస్‌ను స్థాపించారు. ఇది తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది.
విద్యుత్ ఉద్యమం తర్వాత చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి, వైఎస్ 2003లో చేపట్టిన పాదయాత్రతో ప్రజా మద్దతు పూర్తిగా కాంగ్రెస్ వైపు మళ్లింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ - టీఆర్ఎస్ - వామపక్షాల కూటమి ఘన విజయం సాధించి వైఎస్ సీఎం అయ్యారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం కేవలం 47 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. ఈ విద్యుత్ ఉద్యమమే చంద్రబాబు 9 ఏళ్ల పాటు కొనసాగించిన అధికారానికి శాశ్వతంగా ముగింపు పలికించింది. బషీర్‌బాగ్ ఘటన, వామపక్షాల పోరాటం, వైఎస్ తపన ఇవన్నీ కలిసి ఆ ఉద్యమాన్ని చరిత్రాత్మక మలుపుగా నిలిపాయి.